Share News

సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు

ABN , Publish Date - May 06 , 2026 | 12:08 AM

క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ హెచ్చరించారు.

సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
మాట్లాడుతున్న జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌

సేవల్లో పారదర్శకత పాటించాలి

జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, మే 5(ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరం నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ, గృహ నిర్మాణ పనులు, ఉపాధి హామీ పథకం అమలులో జిల్లా మెరుగైన స్థానంలో ఉండాలన్నారు. వేసవి నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. భూముల సర్వే, మ్యుటేషన్ల ప్రక్రియను వేగవంతం చేసి సేవల్లో పారదర్శకతను పెంచడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంపొందించాలని సూచించారు. 22-ఎ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని, ఐవీఆర్‌ఎస్‌ ద్వారా వచ్చే కాల్స్‌ను నిశి తంగా పరిశీలించాలన్నారు. ఈ సమీక్షలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ హరిఓం పాండ్యా, ఇన్‌చార్జి డీఆర్వో పద్మావతి, సీపీవో ప్రసన్నలక్ష్మి, డీఎంహెచ్‌వో డా.కె.అనిత, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

Updated Date - May 06 , 2026 | 12:08 AM