పిల్లల నిధులనూ వదల్లే!
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:10 AM
ప్రభుత్వశాఖలో కీలక అధికారి. విద్యార్థుల నిధులపై కన్నేశాడు. వారి కడుపు కొట్టాలని చూశాడు.
రివ్యూ మీటింగ్ పేరిట వసూళ్లు
ఒక్కో విద్యార్థికి రూ.50 చొప్పున..
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ
ఏబీసీడబ్ల్యూవో, అటెండర్ అరెస్ట్
రూ. 1.84 లక్షల నగదు స్వాధీనం
ప్రభుత్వశాఖలో కీలక అధికారి. విద్యార్థుల నిధులపై కన్నేశాడు. వారి కడుపు కొట్టాలని చూశాడు. సమీక్ష ఉందంటూ వార్డెన్లను పిలిచాడు. ఒక్కో విద్యార్థికి రూ.50 చొప్పన రేటు కట్టాడు. అందరి నుంచి వసూలు చేశాడు. విషయం ఏసీబీ అధికారులకు తెలిసిపోయింది. వచ్చి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు. రూ.1.84 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.
శ్రీకాకుళం, జనవరి 28(ఆంధ్రజ్యోతి):
విద్యార్థుల కడుపు నింపేందుకు ప్రభుత్వం నిధులు ఇస్తే.. వాటిపై కన్నేశాడో అధికారి. హాస్టల్ వార్డెన్లతో సమీక్ష పెట్టారు. సమస్యలపై చర్చిస్తారని అనుకుంటే పొరబాటే. ‘డబ్బులు విడుదలయ్యాయి కదా.. నా వాటా నాకిచ్చేయండి’ అంటూ హుకుం జారీ చేశారు. ఇలా విద్యార్థుల తిండి స్వాహా చేసేందుకు యత్నించిన వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సహాయ అధికారి (ఏబీసీడబ్ల్యువో) ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన కంచిలిలో బుధవారం చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే..
నరసన్నపేట డివిజన్ ఏబీసీడబ్ల్యూవోగా పనిచేస్తున్న గడ్డి బాల ముకుందరావు.. ప్రస్తుతం సోంపేట డివిజన్‌కు కూడా పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్‌ఏసీ) నిర్వర్తిస్తున్నారు. సోంపేట డివిజన్ పరిధిలోని 15 బీసీ వెల్ఫేర్ హాస్టళ్లకు సంబంధించి ప్రభుత్వం ఈ నెల 22వ తేదీన నాలుగు నెలల డైట్ ఛార్జీలను (ఒక్కో హాస్టల్‌కు రూ. 3 లక్షల చొప్పున) విడుదల చేసింది. ఏబీసీడబ్ల్యూవో బాల ముకుందరావు కన్ను ఆ నిధులపై పడింది.
రూ. 50 కడితేనే...
వెంటనే రంగంలోకి దిగిన ఏబీసీడబ్ల్యూవో.. హాస్టల్ సమస్యలపై చర్చిద్దాం రండి అంటూ సోంపేట డివిజన్ పరిధిలోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు (వార్డెన్లకు) కబురు పంపారు. కంచిలి గ్రామంలో ఉన్న ఓ బీసీ హాస్టల్‌లో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఇది సమస్యల పరిష్కారం కాదు.. మామూళ్ల స్వీకరణ కోసం. ఒక్కో విద్యార్థికి రూ. 50 చొప్పున లెక్కగట్టి తనకు ముట్టజెప్పాలని వార్డెన్లను డిమాండ్ చేశారు. ఇందుకోసం తన ఆఫీసులో అవుట్ సోర్సింగ్ అటెండర్‌గా పనిచేస్తున్న గుడ్ల రామకృష్ణను మధ్యవర్తిగా వాడుకున్నారు.
పక్కా ప్లాన్‌తో దాడి..
ముందస్తు సమాచారం అందుకున్న శ్రీకాకుళం ఏసీబీ అధకారులు కంచిలి హాస్టల్‌పై ఆకస్మిక దాడి చేశారు. అప్పటికే సమావేశానికి వచ్చిన ఆరుగురు వార్డెన్ల నుంచి ఏబీసీడబ్ల్యూవో తన అటెండర్ గుడ్ల రామకృష్ణ ద్వారా డబ్బులు వసూలు చేయిస్తున్నారు. ఏసీబీ అధికారులు తనిఖీ చేయగా వారి వద్ద లెక్కల్లో లేని రూ. 1,84,070 నగదు లభించింది.
నీళ్లు నమిలిన అధికారి..
ఈ నగదు ఎక్కడిదని ప్రశ్నించగా.. ఏబీసీడబ్ల్యూవో బాల ముకుందరావు నీళ్లు నమిలారు. అటెండర్ రామకృష్ణ మాత్రం ‘సారు చెప్పమంటేనే వార్డెన్ల నుంచి తీసుకున్నాన’ని నేరం అంగీకరించారు. దీంతో అధికారులు ఆ నగదును సీజ్ చేసి, ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి జరిగితే 14400 లేదా 1064 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫిర్యాదు చేయాలని వారు సూచించారు.