Share News

అభివృద్ధిని అడ్డుకోవద్దు

ABN , Publish Date - May 29 , 2026 | 11:59 PM

Prevention of migration with the construction of an airport ‘ఎయిర్‌పోర్టు నిర్మాణంతో ఉద్దానం ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఉపాధి అవకాశాలు పెరిగి వలసల నివారణ సాధ్యమవుతుంది. అభివృద్ధిని అడ్డుకోవద్దు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భూములు ఇచ్చి.. సహకరించండి. ఏమైనా అనుమానాలు, సమస్యలు ఉంటే చెప్పండి. పరిష్కరిస్తాం. బాధితులందరికీ సకాలంలో పరిహారం అందజేస్తామ’ని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ భరోసా ఇచ్చారు.

అభివృద్ధిని అడ్డుకోవద్దు
ఎం.గంగువాడలో రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • ఎయిర్‌పోర్టు నిర్మాణంతో వలసల నివారణ సాధ్యం

  • సమస్యలు పరిష్కరిస్తాం.. పరిహారం అందజేస్తాం

  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ భరోసా

  • ప్రతిపాదిత గ్రామాల్లో అభిప్రాయ సేకరణ

  • విమానశ్రయం ఏర్పాటుకు భూములు ఇవ్వలేమన్న రైతులు

  • వజ్రపుకొత్తూరు/ హరిపురం, మే 29(ఆంధ్రజ్యోతి): ‘ఎయిర్‌పోర్టు నిర్మాణంతో ఉద్దానం ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఉపాధి అవకాశాలు పెరిగి వలసల నివారణ సాధ్యమవుతుంది. అభివృద్ధిని అడ్డుకోవద్దు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి భూములు ఇచ్చి.. సహకరించండి. ఏమైనా అనుమానాలు, సమస్యలు ఉంటే చెప్పండి. పరిష్కరిస్తాం. బాధితులందరికీ సకాలంలో పరిహారం అందజేస్తామ’ని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ భరోసా ఇచ్చారు. ఎయిర్‌పోర్టు నిర్మాణ ప్రతిపాదిత గ్రామాలైన మందస మండలం ఎం.గంగువాడ, వజ్రపుకొత్తూరు మండలం ఒంకులూరులో శుక్రవారం ఆయన పర్యటించారు. జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌తో కలిసి ఆయా గ్రామాల రైతులతో సమావేశమయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టు వస్తే లభించే ప్రయోజనాలు, అభివృద్ధిని తెలియజేశారు. ‘భవిష్యత్‌లో మూలపేట పోర్టు నుంచి గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టుకు అనుసంధానం చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. ఎయిర్‌పోర్టు నిర్మాణంతో పరిశ్రమలు కూడా వస్తాయి. జిల్లా ప్రజలు జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే దుస్థితి ఉండదు. అభివృద్ధిని అడ్డుకుంటే ఈ ప్రాంతవాసులు అధికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములు ఉన్నందున మరికొంతమేరకు రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తే ఎయిర్‌పోర్టు నిర్మాణం జరుగుతుంది. ఒక ప్రాంతం అబివృద్ధి చెందాలంటే భూములు ఉన్న రైతులు సహకారం అవసరమ’ని కలెక్టర్‌ తెలిపారు. అనంతరం రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించారు.

  • భూములు ఇచ్చేది లేదు

  • ‘భూములు సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నాం. ఎయిర్‌పోర్టు నిర్మాణం పేరిట భూములు తీసుకుంటే తాము ఏవిధంగా బతకాలో అర్థం కావడం లేద’ని ఎం.గంగువాడ, ఒంకులూరు గ్రామాల రైతులు కలెక్టర్‌ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. జీడి, కొబ్బరి, మామిడి, పనస, మునగ వంటి తోటలు కోల్పోతామని వాపోయారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి తాము భూములు ఇవ్వలేమని తేల్చిచెప్పారు. ఎయిర్‌పోర్టు ప్రతిపాదన రద్దు చేసి తమను ఆదుకోవాలని కోరారు.అయితే భూములు కోల్పోయిన రైతులకు పరిహారంతో పాటు విలువైన భూములు మరోచోట అందజేస్తామని కలెక్టర్‌ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తమ భూములు తీసుకోవద్దని ఎయిర్‌పోర్టు వ్యతిరేక కమిటీ సభ్యులు కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ.. మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు. మీరు కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడి మరోసారి మీ నిర్ణయాన్ని తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీవో అప్పలరాజు, తహసీల్దార్లు సీతారామయ్య, శ్రీకాంత్‌, డీటీలు శ్రావన్‌కుమార్‌, రామకృష్ణ, ఆర్‌ఐ ఇందిర, ఎంపీడీవో ఎన్‌.రమేష్‌నాయుడు, రైతులు కొమరి వాసు, పొట్టి మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2026 | 11:59 PM