Share News

మొక్కుబడిగా వద్దు.. బాధ్యతగా పని చేయండి

ABN , Publish Date - May 10 , 2026 | 12:34 AM

Supervision over sanitation should be increased ‘నరసన్నపేట పట్టణాన్ని స్వచ్ఛంగా తీర్దిదిద్దేందుకు పారిశుధ్య పనులపై మరింత పర్యవేక్షణ పెరగాలి. మొక్కుబడిగా కాకుండా బాధ్యతగా పనులు చేయాల’ని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు.

మొక్కుబడిగా వద్దు.. బాధ్యతగా పని చేయండి
జగన్నాథపురంలో అధికారులకు సూచనలు ఇస్తున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

పారిశుధ్యంపై పర్యవేక్షణ పెరగాలి

దుకాణాల వద్ద చెత్త కనిపిస్తే నోటీసులు

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

నరసన్నపేట, మే 9(ఆంధ్రజ్యోతి): ‘నరసన్నపేట పట్టణాన్ని స్వచ్ఛంగా తీర్దిదిద్దేందుకు పారిశుధ్య పనులపై మరింత పర్యవేక్షణ పెరగాలి. మొక్కుబడిగా కాకుండా బాధ్యతగా పనులు చేయాల’ని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను ఆదేశించారు. శనివారం నరసన్నపేటలోని జగన్నాథపురం, పెద్దపేట తదితర వీధుల్లో పారిశుధ్య పనులను కలెక్టర్‌ పరిశీలించారు. తూతూమంత్రంగా పారిశుధ్య పనులు చేపట్టడంపై అసహనం వ్యక్తం చేశారు. ‘పారిశుధ్య కార్మికులు తప్పనిసరిగా చేతికి గ్లౌజులు వేసుకుని పనులు చేయాలి. దుకాణాల వద్ద డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేయాలి. బయట చెత్త వేసేవారికి నోటీసులు జారీచేసి.. అపరాధ రుసుం విధించాల’ని పంచాయతీ అధికారులకు కలెక్టర్‌ సూచించారు. జగన్నాథపురంలో ఇంటింటా చెత్తసేకరణపై స్థానికులతో మాట్లాడారు. తడి, పొడిచెత్తలను వేర్వేరుగా ఇంటికి వచ్చిన గ్రీన్‌ అంబాసీడర్‌కు ఇవ్వాలని తెలిపారు. స్థానిక పారిశుధ్య కార్మికులనే గ్రీన్‌ అంబాసీడర్లుగా నియమించాలని డీపీవో స్వరూపరాణికి ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఆర్‌.వెంకట్రామన్‌, డీఎల్‌పీవో గోపీబాల, ఎంపీడీవోలు, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2026 | 12:34 AM