Share News

కాటేస్తున్నాయ్‌!

ABN , Publish Date - Jun 30 , 2026 | 12:28 AM

Dogs run wild in villages and towns జిల్లాలో వీధికుక్కల సంఖ్య పెరిగిపోయింది. గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడికక్కడ సంచరిస్తూ.. ప్రజలపై దాడి చేస్తున్నాయి. దీంతో చాలామంది ఆస్పత్రుల పాలవుతున్నారు. కుక్కలను చూస్తేనే భయాందోళన చెందుతున్నారు.

కాటేస్తున్నాయ్‌!
ఇచ్ఛాపురంలో కుక్కల స్వైరవిహారం

  • గ్రామాలు, పట్టణాల్లో కుక్కల స్వైరవిహారం

  • నియంత్రణ విషయమై కోర్టు ఆదేశాలు బేఖాతరు

  • దాడులతో ప్రజలకు తప్పని ఇబ్బందులు

  • ఇచ్ఛాపురం, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వీధికుక్కల సంఖ్య పెరిగిపోయింది. గ్రామాలు, పట్టణాల్లో ఎక్కడికక్కడ సంచరిస్తూ.. ప్రజలపై దాడి చేస్తున్నాయి. దీంతో చాలామంది ఆస్పత్రుల పాలవుతున్నారు. కుక్కలను చూస్తేనే భయాందోళన చెందుతున్నారు. కుక్కల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధికుక్కల సంరక్షణకు పట్టణాల్లోని ప్రతివార్డులో సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కొన్నాళ్ల కిందట ఆదేశించింది. అక్కడ వాటికి ఆహారం ఇవ్వాలని సూచించింది. కానీ జిల్లాలో అటువంటి సన్నాహాలు లేవు. శ్రీకాకుళం కార్పొరేషన్‌, ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస మునిసిపాలిటీల్లో ఎక్కడా కుక్కలను నియంత్రిస్తున్న దాఖలాలు లేవు. జిల్లాలో ఎన్ని వీధి కుక్కలు ఉన్నాయో కూడా అధికారులకు తెలియని దుస్థితి. జిల్లాలో ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 2 వేల మంది వరకూ కుక్కకాటు బాధితులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి ప్రతినెల 200 నుంచి 300 మంది కుక్కకాటు బాధితులు వస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

  • ఎన్నో ఘటనలు

  • ఈ నెల 25న పాతపట్నం మేజర్‌ పంచాయతీ అచ్యుతాపురంలో జనావాసాల్లోకి వచ్చిన చుక్కల దుప్పి.. వీధికుక్కల దాడిలో మృతి చెందింది. దాహార్తి తీర్చుకునేందుకు చుక్కల దుప్పి రాగా.. వీధికుక్కలు దాడి చేసి చంపేశాయని గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు తెలిపారు.

  • ఈ నెల 26న టెక్కలి మేజర్‌ పంచాయతీలో శుక్రవారం సాయంత్రం పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. ఎన్టీఆర్‌ కాలనీ, శ్రీనివాసనగర్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌, పాతజాతీయ రహదారి, కొడాలి జంక్షన్‌, తెంబూరు రోడ్డు జంక్షన్‌.. ఇలా పలు ప్రాంతాల్లో 25 మందిపై దాడి చేసింది. కుక్కకాటు బాధితులను స్థానికులు టెక్కలిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. వైద్యచికిత్స అనంతరం వారు కోలుకున్నారు.

  • ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇచ్ఛాపురం మునిసిపాలిటీ గొల్లవీధిలో కుక్కల దాడికి గురై ఐదుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. ఇలా ప్రతీ వార్డులో కుక్కల బెడద రోజురోజుకి పెరుగుతున్నా మునిసిపల్‌ అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు వాపోతున్నారు. పలుమార్లు మునిసిపల్‌ సాధారణ సమావేశాల్లో మాజీ వైస్‌ చైర్‌పర్సన్లు ఉలాల భారతిదివ్య, లాబాల స్వర్ణమణి అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోతోందని వాపోతున్నారు.

  • జీవోనే.. నిధులు లేవు..

  • కుక్కలు, పందుల నియంత్రణ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తం కావడంతో 2020 డిసెంబరు 30న వైసీపీ సర్కార్‌ ఒక జీవో జారీ చేసింది. వీధికుక్కల నియంత్రణ బాధ్యత స్థానిక సంస్థలకు అప్పగించింది. కానీ ఎటువంటి నిధులు మాత్రం కేటాయించలేదు. లైసెన్స్‌లు లేని జంతువుల నియంత్రణకు సరికొత్త మార్గదర్శకాలిచ్చింది. కుక్కలు, పందులు పెంచుకోవాలంటే అనుమతులు తప్పనిసరి చేసింది. అనుమతి లేకుండా పెంచితే వాటి యజమానులకు రూ.500 అపరాధ రుసుం విధించాలని ఆదేశాలిచ్చింది. అప్పటికీ నిబంధనలు ఉల్లంఘిస్తే రోజుకు రూ.250 చొప్పున జరిమానా విధించాలని పేర్కొంది. లైసెన్స్‌ జారీ, రెన్యువల్‌ బాధ్యతల స్థానిక సంస్థలకు అప్పగించింది. యాంటీరేబిస్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నట్టు, పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు ధ్రువీకరణ పత్రాలు పొంది ఉండాలని స్పష్టం చేసింది. కానీ జిల్లాలో ఇవెక్కడా అమలవుతున్న దాఖలాలు లేవు.

  • జిల్లావ్యాప్తంగా లక్ష వరకూ కుక్కలు ఉంటాయన్నది ఒక అంచనా. అయితే పశుసంవర్ధక శాఖ వద్ద సరైన గణాంకాలు లేకపోవడం విచారకరం. దాదాపు ఏ ప్రభుత్వ ఆస్పత్రి రికార్డులు చూసినా కుక్కకాటు బాధితులు నెలలో పదుల సంఖ్యలో ఉంటున్నారు. కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతోనైనా వాటిని నియంత్రించాలని పలువురు కోరుతున్నారు.

  • పిచ్చికుక్క దాడి.. నలుగురికి గాయాలు

  • సరుబుజ్జిలి, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): సరుబుజ్జిలి మండలం నందికొండ గ్రామంలో సోమవారం పిచ్చికుక్క దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మూడు ఆవులు కూడా కుక్కకాటుకు గురై గాయపడ్డాయి. నందికొండకు చెందిన బొడ్డేపల్లి చామంతి, కొమనాపల్లి చిన్నమ్మడు, దవలరాజుతోపాటు అన్నెపు సింహాచలం అనే వద్ధుడిపై కుక్కదాడి చేయగా తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు స్థానిక ప్రాథమిక ఆస్పత్రిలో చికిత్స పొందారు. అన్నెపు సింహాచలం పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. అలాగే నందికొండ ప్రాథమిక పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులపై కూడా పిచ్చికుక్క దాడికి యత్నించగా.. గ్రామస్థులు దానిని వెంబడించారు. ఈక్రమంలో సమీపంలో ఉన్న వంశధార కుడి ప్రధాన కాలువలో పడి కుక్క మృతి చెందింది. దీంతో నందికొండ గ్రామస్థులు, విద్యార్థులు ఊపిరిపీల్చుకున్నారు.

  • కుక్కలను నియంత్రించాలి

  • జిల్లాలో కుక్కల సంతతి పెరగడంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండేళ్ల కిందట జి.సిగడాం మండలంలో ఇంట్లోని ఉయ్యాలలో ఉన్న చిన్నారిపై దాడిచేసి చంపేశాయి. అయినా సరే అప్పట్లో అధికారులు చేతులు దులుపుకొన్నారు. ఇప్పటికైనా కుక్కల సంతతిని తగ్గించేలా చర్యలు చేపట్టాలి.

    - చాట్ల లోహిదాస్‌రెడ్డి, ఇచ్ఛాపురం

Updated Date - Jun 30 , 2026 | 12:29 AM