ప్రజారోగ్యం పట్టదా?
ABN , Publish Date - Mar 14 , 2026 | 11:54 PM
Collector's anger against corporation officers ‘ప్రజారోగ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించడంలో ఎందుకు విఫలమవుతున్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తప్పవ’ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను హెచ్చరించారు.
క్షేత్రస్థాయి విధుల్లో ఇంత నిర్లక్ష్యమా?
కార్పొరేషన్ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశం
శ్రీకాకుళం కలెక్టరేట్, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ‘ప్రజారోగ్యం ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించడంలో ఎందుకు విఫలమవుతున్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తప్పవ’ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను హెచ్చరించారు. సకాలంలో పనులు పూర్తిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. శనివారం స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో వార్డు ఎమినిటీస్ సెక్రటరీలు, పబ్లిక్ హెల్త్, శానిటరీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలో డ్రైనేజీ, మంచినీటి పైపులైన్ల పనులు ఎంతవరకు జరిగాయని, నివేదిక చూపించాలని ఎమినిటీ సెక్రటరీలను కలెక్టర్ ప్రశ్నించారు. వారి సమాధానాలపై కలెక్టర్ అసంతృప్తి చెందారు. క్షేత్రస్థాయి విఽధుల్లో ఎందుకు విఫలమవుతున్నారని, సకాలంలో పనులు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీటి సరఫరా వ్యవస్థలో లోపాలు, పైపులైన్ల కనెక్షన్లు, పారిశుద్ధ్య నిర్వహణలో వైఫల్యాలు కనిపిస్తున్నాయని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపించడం వల్లనే డయేరియా వంటి సమస్యలు తీవ్రతరమవుతున్నాయని తెలిపారు. ప్రజల సౌకర్యాల విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పైపులైన్లు, లీకేజీలు, మురుగునీటి కాలువల పూడికతీత పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మునిసిపల్ హెల్త్ అధికారి డా.సుధీర్, అసిస్టెంట్ కమిషనర్ శివకుమార్, డీఈఈ రవిశర్మ, ఏఈలు సత్యనారాయణ, సందీప్, రాజేష్, ఏవో మంగమ్మ పాల్గొన్నారు.