మాజీమంత్రి అప్పలరాజుకు చట్టమంటే తెలియదా?
ABN , Publish Date - Jul 13 , 2026 | 11:32 PM
Rs. 10 lakh financial aid to the deceased's family మాజీమంత్రికి చట్టం అంటే ఏమిటో తెలియకపోవడం దురదృష్టకరం. కుమారుడ్ని కేసు నుంచి తప్పించడానికి యత్నించిన సీదిరి అప్పలరాజు కూడా నిందితుడే’ అని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.
కుమారుడ్ని కేసు నుంచి తప్పించడానికి యత్నించిన ఆయనా నిందితుడే
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
మృతుడి కుటుంబానికి పరామర్శ.. రూ.10 లక్షల ఆర్థిక సాయం
పలాస, జూలై 13(ఆంధ్రజ్యోతి): ‘మాజీమంత్రికి చట్టం అంటే ఏమిటో తెలియకపోవడం దురదృష్టకరం. కుమారుడ్ని కేసు నుంచి తప్పించడానికి యత్నించిన సీదిరి అప్పలరాజు కూడా నిందితుడే’ అని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. మాజీమంత్రి తనయుడి నడిపించిన వాహనానికి బలైన గొర్రెల కాపరి దుబ్బ దానయ్య కుటుంబాన్ని సోమవారం ఆయన పరిమర్శించారు. ప్రభుత్వం తరుపున రూ.10లక్షల పరిహారం అందజేస్తామని ప్రకటించారు. అనంతరం విలేకరులతో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘దానయ్య కుటుంబ సభ్యుల పరిస్థితి దయనీయంగా ఉంది. వారిని ప్రభుత్వపరంగా ఆదుకుంటాం. మాజీమంత్రి.. ఆయన కుమారుడి కోసం చట్టాలను చేతిలోకి తీసుకుని.. వ్యవస్థలను తప్పుదారి పట్టించడం దారుణం. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో అనేక సంఘటనలు రాజకీయంగా మాట్లాడే అప్పలరాజు.. ఆయన కుమారుడు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించడం హేయనీయం. తప్పు చేసిన కుమారుడ్ని దండించి పోలీసులకు అప్పగించాల్సింది పోయి వేరే వ్యక్తిని ఇరికించారు. దీన్ని చరిత్ర క్షమించద’ని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌతు శిరీష, టీడీపీ నాయకులు వజ్జ బాబూరావు, లొడగల కామేశ్వరరావుయాదవ్, పీరుకట్ల విఠల్‌రావు, మల్లా శ్రీనివాస్, సప్ప నవీన్, ఎం.నరేంద్ర, గాలి కృష్ణారావు, గురిటి సూర్యనారాయణ, అంబటి కృష్ణమూర్తి, దడియాల నర్సింహులు పాల్గొన్నారు.