Share News

సాగునీరు దిగువకు విడిచిపెట్టొద్దు

ABN , Publish Date - Mar 24 , 2026 | 12:02 AM

Farmers' protest at Gota Barrage సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు. హిరమండలంలో గొట్టాబ్యారేజీ దిగువకు వంశధార అధికారులు నీటిని విడిచిపెట్టడంపై మరోసారి ఆందోళన చేపట్టారు.

సాగునీరు దిగువకు విడిచిపెట్టొద్దు
గొట్టాబ్యారేజీ వద్ద ఆందోళన చేస్తున్న రైతులు

గొట్టాబ్యారేజీ వద్ద రైతుల ఆందోళన

రహదారిపై నిలిచిన ట్రాఫిక్‌

హిరమండలం, మార్చి 23(ఆంధ్రజ్యోతి): సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు. హిరమండలంలో గొట్టాబ్యారేజీ దిగువకు వంశధార అధికారులు నీటిని విడిచిపెట్టడంపై మరోసారి ఆందోళన చేపట్టారు. బ్యారేజీ వద్ద మరమ్మతులు చేపట్టాలంటే ఎగువ ప్రాంతంలో నిల్వ ఉన్న నీటిని ఖాళీ చేయాలి. ఈమేరకు వంశధార అధికారులు ఈనెల 17న గొట్టాబ్యారేజీ వద్ద ఒక గేటు పైకెత్తి నీటిని దిగువకు విడిచిపెట్టారు. ఆ సమయంలో ఎడమ కాలువ ఆయకట్టు రైతులు.. దిగువకు నీటిని విడిచిపెట్టొద్దంటూ బ్యారేజీ వద్ద ధర్నా చేశారు. దీంతో అధికారులు బ్యారేజీ దిగువకు నీటి విడుదల నిలిపేశారు. ఎడమ కాలువ ద్వారా నీటిని పంపించారు. బ్యారేజీ పనులు చేపట్టేందుకు సమయం మించిపోతుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం ఉదయం మళ్లీ రెండు గేట్లు పైకెత్తి సుమారు 900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టారు. విషయం తెలుసుకున్న పిండ్రువాడ, భగీరఽథపురం, మహాలక్ష్మీపురం, అంబావల్లి తదితర గ్రామాలకు చెందిన రైతులు బ్యారేజీ వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. రహదారిపై బైఠాయించి.. వాహనాలు అడ్డుకుని నినాదాలు చేశారు. నదిలో నీటిని దిగువకు విడిచి పెట్టడం వలన వంశధార ప్రాజెక్టు ఎడమ కాలువ ఆయకట్టు భూములకు సాగునీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వరి, మొక్కజొన్న, రబీ పంటలకు నీరందక నష్టపోతున్నామని వాపోయారు. ఈ నెలాఖరు వరకు ఎడమ కాలువ ద్వారా పంటలకు నీరు విడిచిపెట్టాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఇక్కడ నుంచి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. రైతుల నిరసన నేపథ్యంలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. బ్యారేజీ సిబ్బంది ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు ఎత్తిన గేట్లను కిందకు దించేశారు. దీంతో రైతులు శాంతించి వెనుదిరిగారు. ట్రాఫిక్‌ను పోలీసులు క్లియర్‌ చేశారు.

Updated Date - Mar 24 , 2026 | 12:02 AM