ఎరువుల కొరత సృష్టించొద్దు
ABN , Publish Date - Aug 23 , 2026 | 12:19 AM
License to be cancelled if fertilizers are sold at inflated prices జిల్లాలో రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడకుండా వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. శనివారం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖ, నీటిపారుదలశాఖ అధికారులతో సమీక్షించారు.
అధిక ధరకు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేయండి
శివారు ఆయకట్టుకు సాగునీరు అందించాల్సిందే
మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం
కోటబొమ్మాళి, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడకుండా వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. శనివారం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖ, నీటిపారుదలశాఖ అధికారులతో సమీక్షించారు. ‘జిల్లాలో 3,65,604 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. ఈ సాగు విస్తీర్ణానికి రెండోదశ వరకు 26,440 టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటివరకు 25,860 టన్నుల యూరియాను సరఫరా చేశాం. ప్రస్తుతం జిల్లాలో మరో 11,659 టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి కొరత లేద’ని అధికారులు వెల్లడించారు. మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ.. ‘జిల్లాలో ఎరువుల కొరత సృష్టిస్తే సహించేది లేదు. ఎరువుల డీలర్లు యూరియా, డీఏపీని అధిక ధరలకు విక్రయిస్తే కఠినంగా వ్యవహరించాలి. అవసరమైతే లైసెన్స్ రద్దు చేయాలి. డీలర్ల వద్ద ఉన్న ఎరువుల నిల్వలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. రైతులకు సకాలంలో ఎరువులు పంపిణీ చేయాలి. అర్హులైన రైతులందరికీ పంటల బీమా అందేలా చర్యలు చేపట్టాల’ని మంత్రి అచ్చెన్న ఆదేశించారు. కాలువ శివారు భూముల్లో వరికి బదులుగా ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని తెలిపారు. గ్రామస్థాయిలో రైతులకు పంట ఎంపిక, సాగు పద్ధతులు, ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. శివారు ఆయకట్టు భూములకు సైతం సాగునీరు అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎన్.కృష్ణమూర్తి, వంశధార ఎస్‌ఈ జి.రామచంద్రరావు, ఈఈలు ఎం.మురళీమోహన్, శేఖర్‌రావు, డీఈఈలు, ఏఈఈలు, ఇరిగేషన్, వ్యవసాశాఖ అధికారులు పాల్గొన్నారు.