Share News

ప్రైవేటు బస్సుల్లో అధికంగా చార్జీలు వసూలు చేయొద్దు

ABN , Publish Date - Jan 10 , 2026 | 12:20 AM

సంక్రాంతి పండుగ సమయంలో సుదూర ప్రాంతాల నుంచి తమ సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల నుంచి ప్రైవేటు బస్సు యజమానులు టిక్కెట్‌ రేట్లను అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఉప రవాణా కమిషనర్‌ ఎ.విజయసారఽథి తెలిపారు.

ప్రైవేటు బస్సుల్లో అధికంగా చార్జీలు వసూలు చేయొద్దు
ప్రైవేటు బస్సు యజమానులతో మాట్లాడుతున్న ఉప రవాణా కమిషనర్‌ విజయసారథి

- ప్రయాణికుల కోసం హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ 92816 07001

- ఉప రవాణా కమిషనర్‌ విజయసారఽథి

పాత శ్రీకాకుళం, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ సమయంలో సుదూర ప్రాంతాల నుంచి తమ సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల నుంచి ప్రైవేటు బస్సు యజమానులు టిక్కెట్‌ రేట్లను అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఉప రవాణా కమిషనర్‌ ఎ.విజయసారఽథి తెలిపారు. రూరల్‌ మండలం తండేంవలస ఆర్టీవో కార్యాలయంలో శుక్రవారం జిల్లాలోని అన్ని ప్రైవేటు బస్సుల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేయరాదని స్పష్టం చేశారు. టికెట్‌ ధరలు అధికంగా వసూలు చేసే ప్రైవేటు బస్సు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్టీజీఎస్‌, అభి బస్‌, రెడ్‌ బస్‌ వంటి యాప్‌ల ద్వారా బస్సు చార్జీలను నిరంతరం పర్యవేక్షిస్తామని చెప్పారు. అధిక ధరలు వసూలు చేసే వారిపై కేసులు పెడతామని అన్నారు. ప్రతి ప్రైవేటు బస్సులోనూ రవాణా శాఖ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 92816 07001 ను ప్రదర్శించాలని యజమానులను ఆదేశించారు. జనవరి 18వ తేదీ వరకు ప్రైవేటు బస్సులను తనిఖీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి ఆర్టీవో ఆర్‌.అనిల్‌, మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.వి గంగాధర్‌, సహాయ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ శిరీషాదేవి, ప్రైవేటు బస్సు యజమానులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2026 | 12:20 AM