దానయ్య కుటుంబానికి న్యాయం చేయండి
ABN , Publish Date - Jul 16 , 2026 | 12:38 AM
దుబ్బ దానయ్య మృతికి కారణమైన వారందరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, నేరానికి సహకరించిన వారిని విడిచి పెట్టకూడదని కూటమి నాయకులు డిమాండ్ చేశారు.
- ఆయన మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి
- కొవ్వొత్తులతో కూటమి నాయకుల ర్యాలీ
కాశీబుగ్గ, జూలై 15 (ఆంధ్రజ్యోతి): దుబ్బ దానయ్య మృతికి కారణమైన వారందరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, నేరానికి సహకరించిన వారిని విడిచి పెట్టకూడదని కూటమి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కాశీబుగ్గలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి మూడు రోడ్ల జంక్షన్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి, మానవహరం చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దానయ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ బైక్‌తో బలంగా ఢీకొట్టడంతో దానయ్య మృతి చెందాడని అన్నారు. ఈ కేసు నుంచి కుమారుడిని రక్షించేందుకు అప్పలరాజు వ్యవస్థలను తప్పుదోవ పట్టించారన్నారు. ఆరవ్‌ను సంఘటనా స్థలం నుంచి తీసుకొని వెళ్లిపోయి, తన అనుచరుడు సిద్ధార్ధ త్యాడిని స్టేషన్‌కు పంపించి లొంగిపోయేలా చేశారన్నారు. అయితే, సీసీ ఫుటేజ్‌తో వారి బండారం బయటపడిందన్నారు. ఆరవ్‌ను పోలీసులు అరెస్టు చేసి 14 రోజులు రిమాండ్‌కు పంపించారన్నారు. అయితే సాక్ష్యాలను తారుమారు చేయడం నేరమని, ఆ సంఘటనలో ఉన్న వారందరిపై దర్యాప్తు చేసి అదుపులోకి తీసుకోవాలని కోరారు. ఇంతవరకు దానయ్య కుటుంబాన్ని అప్పలరాజు పరామర్శించలేదన్నారు. కేసును తప్పుదోవ పట్టించిన ఆయన్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దానయ్య కుటుంబానికి ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరుకట్ల విఠల్‌రావు, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి లొడగల కామేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు, నాయకులు గాలి కృష్ణారావు, సప్ప నవీన్, డొక్కరి శంకర్, రవిశంకర్ గుప్తా, దువ్వాడ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.