Share News

న్యాయం చేయండి

ABN , Publish Date - Mar 14 , 2026 | 12:42 AM

బాలింత మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బాధిత కుటుంబీకులు ధర్నాకు దిగారు.

న్యాయం చేయండి
వనిత మృతదేహంతో ధర్నా చేస్తున్న కుటుంబీకులు

- బాలింత మృతదేహంతో ధర్నా

- పోలీసుల రంగ ప్రవేశం

పాతపట్నం, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): బాలింత మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ బాధిత కుటుంబీకులు ధర్నాకు దిగారు. తమకు న్యాయం చేయాలని జాతీయ రహదారిపై రాస్తోరోకో చేపట్టారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. కొత్తూరు మండల గూనభద్ర గ్రామానికి చెందిన కల్లపల్లి శివకు ఒడిశాలోని అక్కరఖండి గ్రామానికి చెందిన కల్లపల్లి వనిత(24)తో నాలుగేళ్ల కిందట వివాహం అయ్యింది. వీరు హైదరాబాద్‌లో వలస కూలీలుగా వెళ్లి జీవనం సాగిస్తున్నారు. మొదటి కాన్పులో వనిత మగబిడ్డకు జన్మనిచ్చింది. రెండో కాన్పు కోసం పాతపట్నంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఈనెల 9న చేరింది. అక్కడ వైద్యులు ఆపరేషన్‌ చేయడంతో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రసవానంతరం అస్వస్థతకు గురైన వనితకు రక్తం చాలదంటూ ఎక్కించారు. తదుపరికూడా ఆరోగ్య పరిస్థితి కుదుటపడకపోడంతో వైద్యులు సిఫారసు మేరకు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ గురువారం అర్ధరాత్రి మృతిచెందింది. దీంతో మృతురాలి కుటుంబీకులు శుక్రవారం పెద్దఎత్తున పాతపట్నంలోని ప్రైవేట్‌ హాస్పిటల్‌ వద్దకు చేరుకొని వనిత మృత దేహంతో ధర్నా చేపట్టారు. ఆమె మృతికి తమ వైద్యం కారణం కాదని వైద్యులు చెప్పినా వారు వినలేదు. స్థానిక సీఐ కె.సన్యాసినాయుడు, మెళియాపుట్టి ఎస్‌ఐ మహ్మద్‌ ఆలీ తమ సిబ్బందితో రంగప్రవేశం చేశారు. మృతురాలి కుటుంబీకుల నుంచి ఫిర్యాదును కోరారు. పోస్టుమార్టం నిర్వహిస్తామంటూ వారు చెప్పడంతో ఆగ్రహానికి గురయ్యారు. దీంతో స్థానిక కోర్టు కూడలి వద్ద జాతీయ రహదారిపై వనిత మృతదేహాన్ని ఉంచి రాస్తారోకో నిర్వహించారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసుల వైఖరిని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. దీంతో సీఐ కె.సన్యాసినాయుడు శాంతింపజేయడంతో వారు నిరసన కార్యక్రమాన్ని విరమించారు.

Updated Date - Mar 14 , 2026 | 12:42 AM