చర్యలుంటాయా?
ABN , Publish Date - Jul 09 , 2026 | 11:58 PM
Notices issued to 36 mills రేషన్ బియ్యం పక్కదారి పడుతూనే ఉన్నాయి. ఏళ్ల తరబడి ఈ వ్యవహారం కొనసాగుతున్నా.. అధికారులు జరిమానా విధించి వదిలేయడం తప్ప.. రేషన్ మాఫియాపై కఠినచర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
ఏళ్లతరబడి రేషన్ బియ్యం పక్కదారి
జిల్లాలో భారీస్థాయిలో కుంభకోణం
కొనసాగుతున్న దర్యాప్తు
36 మిల్లులకు నోటీసులు
దర్యాప్తు అడ్డుకునేందుకు ప్రయత్నాలు
నరసన్నపేట, జూలై 9(ఆంధ్రజ్యోతి): రేషన్ బియ్యం పక్కదారి పడుతూనే ఉన్నాయి. ఏళ్ల తరబడి ఈ వ్యవహారం కొనసాగుతున్నా.. అధికారులు జరిమానా విధించి వదిలేయడం తప్ప.. రేషన్ మాఫియాపై కఠినచర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇదే అలుసుగా అక్రమార్కులు పేదల బియ్యన్ని బొక్కేస్తున్నారు. రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి.. ప్రజలను, ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించి రూ.కోట్లు సంపాదిస్తున్నారు. ఇటీవల పెందుర్తిలోని ‘బియ్యం కుంభకోణం’ వెలుగులోకి రావడంతో.. జిల్లాలో 36 మంది మిల్లర్లకు అధికారులు నోటీసులు జారీచేశారు. జిల్లాలో కూడా బియ్యం అక్రమాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించడంతో.. దర్యాప్తును అడ్డుకునేందుకు రేషన్ మాఫియా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
ఇదీ పరిస్థితి
జిల్లాలో 1,603 డిపోల పరిధిలో 6,60,739 రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రతినెలా సుమారు 22 లక్షల మంది లబ్ధిదారులకు దాదాపు 8వేల టన్నుల బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఆహారభద్రత పథకం కింద ఉచితంగా అందజేస్తోంది. ఈ బియ్యంపై కొందరి మిల్లర్లు కన్ను పడింది. గ్రామస్థాయిలో దళారుల ద్వారా కార్డుదారుల నుంచి కిలో రూ.17 నుంచి రూ.20 చొప్పున రేషన్ బియ్యం కొనుగోలు చేస్తున్నారు. దళారులు వాటిని గుట్టుచప్పుడు కాకుండా మిల్లులకు చేర్చుతున్నారు. జిల్లాలో శ్రీకాకుళం, కోటబొమ్మాళి, పలాస, నరసన్నపేట, బొరిగివలస, మడపాం తదితర ప్రాంతాల్లో మిల్లులకు వ్యాన్లలో రేషన్ బియ్యం తరలిస్తున్నారు. మిల్లుల్లో వాటిని రీసైక్లింగ్ చేసి ఎఫ్‌సీఐ గోదాములకు తరలిస్తూ.. సీఎంఆర్ విధానంలో ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం స్థానంలో అప్పగిస్తున్నారు. ఆపై రూ.కోట్లలో అక్రమార్జన పొందుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో కొందరు మిల్లర్లు లక్ష టన్నులకుపైగా రేషన్ బియ్యాన్ని సీఎంఆర్ విధానంలో పంపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో రూ.100కోట్ల వరకు భారీ కుంభకోణానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
కొత్తసంచుల్లో ప్యాకింగ్ ...
జిల్లాలో అక్రమారులు.. రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి.. మిల్లులకు దూరంగా ఉండే గిడ్డంగులలో నిల్వ చేస్తారు. మిల్లులో ఈ బియ్యాన్ని పాలిష్ చేసి.. మెరుపు వచ్చేలా నూనె వేసి మిల్లింగ్ చేస్తారు. ఆపై ఎవరికీ అనుమానం రాకుండా కొత్తసంచులు, లేబుల్స్‌తో ప్యాకింగ్ చేసి ఎఫ్‌సీఐ, పౌరసరఫరాలశాఖకు పంపిస్తున్నట్టు తెలుస్తోంది. గిడ్డంగులకు వెళ్లే బియ్యానికి మిల్లర్లు ఒక ఏసీక్‌కు (29టన్నులు బియ్యం) రూ.15 వేల నుంచి రూ.25వేల వరకు మామూళ్లు చెల్లించడంతో కొంతమంది అధికారులు, క్వాలిటీ కంట్రోల్ అధికారులు, సిబ్బంది వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈఏడాది ఖరీఫ్‌లో ప్రభుత్వం 6.91లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసి జిల్లాలో రైస్‌మిల్లర్లకు సీఎంఆర్ విధానంలో బియ్యం సేకరణకు అప్పగించింది. ఈ సీజన్‌లో డిసెంబరు నుంచి ఏప్రిల్ వరకు మిల్లర్లు సివిల్‌సప్లయ్‌కు 2.8లక్షల మెట్రిక్‌టన్నలు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు 1.89 లక్షలు మెట్రిక్ టన్నుల ధాన్యం మరపెట్టి అప్పగించారు. నిబంధనల మేరకు కస్టమ్స్ మిల్లింగ్ విధానంలో మిలర్ల నుంచి సేకరించాలి. ఈ విధానంలో రేషన్ మాఫియా తలదూర్చి సివిల్‌సప్లయ్‌శాఖకు, ఎఫ్‌సీఐకు లక్షలాది టన్నులు రేషన్ బియ్యాన్ని అంటగట్టి కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపణలు వెల్తువెత్తున్నాయి. ఒక్క నరసన్నపేట నుంచి సుమారు 80 ఏసీక్‌ల రేషన్ బియ్యం మాఫియా చేతివాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఇందులో పెందుర్తి ఎఫ్‌సీఐకు 41 ఏసీక్‌లు, జిల్లాలో వివిధ గిడ్డంగులకు 39 ఏసీక్‌లు పంపించారని సమాచారం.
క్వాలిటీలో కిరికిరి
మిల్లర్లు సీఎంఆర్ విధానంలో గిడ్డంగులకు పంపించిన బియ్యాన్ని క్వాలిటీ కంట్రోల్ అధికారులు పరీక్షించి.. పచ్చజెండా ఊపిన తర్వాతే గిడ్డంగిలోకి బియ్యాన్ని అన్‌లోడింగ్ చేస్తారు. మిల్లర్లు పంపించిన బియ్యం బ్యాగ్‌ల నుంచి శాంపిల్ సేకరించి అందులో నూకలు, మొతకలు, తేమశాతం తదితర అంశాలను క్షుణ్నంగా పరిశీలించాలి. కాగా మిల్లర్లు ముందస్తు లోపాయికారి ఒప్పందంతో కొంతమంది క్వాలిటీ కంట్రోల్ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జిల్లాకు చెందిన పలువురు మిల్లర్లు.. పెందుర్తిలో గిడ్డంగికి పంపించిన బియ్యంలో కల్తీ జరిగినట్టు అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లాలోని గిడ్డంగుల్లో ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖకు పంపించిన బియ్యం నాణ్యతను పరిశీలించేందుకు దర్యాప్తు కమిటీ వేయనున్నట్టు ప్రచారం సాగడంతో అక్రమాలకు పాల్పడిన క్వాలిటీ కంట్రోల్ అధికారుల్లో వణుకు ప్రారంభమైంది.
మరింత లోతుగా దర్యాప్తు
రేషన్ మాఫియా ఆగడాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. పెందుర్తి ఎఫ్‌సీఐ గోదాంలో మిల్లర్లు పంపించిన బియ్యంలో రేషన్ బియ్యం ఉండటంతో మిల్లర్లుకు నోటీసులు జారీ చేశారు. గుట్టుచప్పుడ కాకుండా దర్యాప్తు నిర్వహించి ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. మరోవైపు ఎఫ్‌సీఐకు ఆన్‌లైన్‌లో కొందరు ఫిర్యాదు చేయడంతో.. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. దర్యాప్తును అడ్డుకునేందుకు అక్రమార్కులు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ విషయంపై పౌరసరఫరాలశాఖ డీఎం వేణుగోపాలరావు వద్ద ప్రస్తావించగా.. ‘రేషన్ బియ్యం వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోంది. జిల్లాలో 31 మంది మిల్లర్లకు నోటీసులు జారీ చేశాం. దర్యాప్తు సమయంలో వివరాలు వెల్లడించలేమ’ని తెలిపారు.