మిలట్రీ మద్యం పక్కదారి
ABN , Publish Date - Jun 10 , 2026 | 11:27 PM
సైనికులు, మాజీ సైనికోద్యోగులకు అందిస్తున్న మిలట్రీ మద్యం పక్కదారి పడుతోంది.
- ఆన్‌లైన్‌లో అధిక ధరకు విక్రయం
- వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి మరీ అమ్మకాలు
పలాస, జూన్ 10(ఆంధ్రజ్యోతి): సైనికులు, మాజీ సైనికోద్యోగులకు అందిస్తున్న మిలట్రీ మద్యం పక్కదారి పడుతోంది. వైన్ షాపుల్లో ప్రీమియం బ్రాండ్ల మద్యం రూ.1400 నుంచి రూ.2500 వరకూ విక్రయిస్తుండగా, అదేబ్రాండ్ ఉన్న మిలట్రీ మద్యం రూ.వెయ్యి నుంచి రూ.1500కు బహిరంగం మార్కెట్‌లో లభ్యమవుతుంది. దీనికోసం కొంతమంది బ్రోకర్లు ఏకంగా వాట్సాప్ గ్రూపులను పెట్టారు. ఈ గ్రూపుల్లో మద్యం రకాలు పెడుతూ విక్రయాలు చేపడుతున్నారు. గతంలో విశాఖపట్నం, శ్రీకాకుళం, గోపాలపూర్(ఒడిసా)లో మిలట్రీ క్యాంటీన్లు ఉండేవి. ఇటీవల పలాసలోని చిన్నబడాం రోడ్డులో మిలట్రీ క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ సైనిక ఉద్యోగులకు మార్కెట్ ధర కన్నా సబ్సిడీ ధరలకు మద్యం అందిస్తారు. మార్కెట్‌లో రూ.వెయ్యి ఉన్న మద్యం బాటిల్ మిలట్రీ క్యాంటీన్‌లో రూ.240 నుంచి రూ.300 వరకూ లభిస్తుంది. కోటా ప్రకారం ఒక్కో మిలట్రీ ఉద్యోగికి వారి స్థాయినిబట్టి 4 నుంచి 15 ఫుల్‌బ్యాటిల్స్ వరకూ వస్తాయి. వీరి నుంచి కొంతమంది బ్రోకర్లు కొనుగోలు చేసి బయట మార్కెట్‌లో అధిక ధరలకు అమ్ముతున్నారు. పలాస క్యాంటీన్‌లో రూ.40 లక్షలకు పైగా మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు అంచనా. ఈ కారణంగా స్థానిక మద్యం షాపుల్లో ప్రీమియం బ్రాండ్ల అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. దీంతో రూ.లక్షలకు వేలంలో షాపులు దక్కించుకున్న వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఎక్సైజ్‌శాఖ అధికారులకు తెలిసినా తమకెందుకులే అని మౌనం దాల్చుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ విషయమై కాశీబుగ్గ ఎక్సైజ్ సీఐ మల్లికార్జునరావును వివరణ కోరగా.. ‘మిలట్రీ మద్యం అమ్మకాలు వాస్తవమే. దీనిపై మాకు ఫిర్యాదు వచ్చిన వెంటనే గాంధీనగర్‌లో ఉన్న అమ్మకందారుడిపై కేసు నమోదు చేశాం. మరికొంతమంది అనుమానిత వ్యక్తులపై నిఘా పెట్టాం. బహిరంగ మార్కెట్‌లో మద్యం అమ్మకాలు జరపడం నేరం. దీనిపై మాకు సమాచారం అందిస్తే తక్షణం అటువంటివారిపై కేసులు నమోదు చేస్తాం.’అని అన్నారు.