‘ఆయుష్మాన్’లో జిల్లా దూకుడు
ABN , Publish Date - Sep 16 , 2026 | 11:32 PM
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్‌లో జిల్లా దూసుకుపోతోంది. ఈ కార్యక్రమం అమలులో ఐదో స్థానంలో నిలిచింది.
- ఆస్పత్రులన్నీ ఒకే గొడుగు కిందకు
- డిజిటలైటేషన్ ప్రక్రియ పూర్తి
- రోగులకు ‘అబా’ నెంబర్ కేటాయింపు
- దేశంలోనే జిల్లాకు ఐదోస్థానం
శ్రీకాకుళం కల్చరల్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్‌లో జిల్లా దూసుకుపోతోంది. ఈ కార్యక్రమం అమలులో ఐదో స్థానంలో నిలిచింది. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను డిజిటలైజేషన్ చేసి ఒకే గొడుగుకిందకు తీసుకొచ్చే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, సిబ్బంది వివరాలను డిజిటలైటేషన్ పూర్తిచేసింది. ప్రస్తుతం ప్రైవేట్ ఆస్పత్రులను డిజిటలైజ్ చేసే పనిలో పడింది.
మోడల్ జిల్లాగా ఎంపిక..
రోగికి ఖర్చు లేకుండా, సులభంగా, తక్కువ సమయంలో సేవలను అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్‌ను ప్రారంభించింది. దీనికోసం శ్రీకాకుళాన్ని మోడల్ జిల్లాగా ఎంపిక చేసింది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి అందించింది. జిల్లాలోని ప్రజలందరికీ 14 అంకెలతో కూడిన ఐడీ నెంబర్‌ను అధికారులు నమోదు చేస్తున్నారు. దీనినే అభా నెంబర్ అంటారు. ఏఎఎన్‌ఎంలు ఇప్పటివరకు నిర్వహించిన ఎన్‌సీడీసీడీ సర్వేలో అన్ని కుటుంబాలకు ఈ అబా నెంబర్‌ను అందించారు. ఎరికైనా అబా నెంబరు లేకపోతే, అటువంటి వ్యక్తి ఆధార్ కార్డు, ఫోన్‌నెంబరుతో ఆసుపత్రికి వెళితే వెంటనే ఐడీని క్రియేట్ చేస్తున్నారు.
వివరాలన్నీ ఆన్‌లైన్..
రోగికి సంబంధించిన మొత్తం సమాచారమంతా అభా నెంబరుతో డిజిటల్ రికార్డుకు అనుసంధానం వెంటవెంటనే జరిగిపోతోంది. రోగం, వాడే మందులు, చేసిన వైద్య పరీక్షలు అన్నీ అభా నెంబరుకు లింక్ అయి ఉంటాయి. దీంతో పాటు ఆ రోగికి ఏదైనా బీమా ఉంటే ఆ సమాచారం కూడా లింక్ అవుతుంది. దాదాపు జిల్లాలో ఉన్న 71 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 13 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 13 సామాజిక ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రి, భోదనా ఆసుపత్రిలో ఈ ప్రక్రియ జరుగుతోంది. దీంతో పాటు ఆయా ఆసుపత్రుల వైద్యాధికారులు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్ట్‌లు హెచ్‌పీఆర్ (హెల్త్‌కేర్ ప్రొఫెషనల్ రిజిస్ట్రీ ఐడింటిఫికేషన్) ఐడీ, అదేవిధంగా ఆసుపత్రికి హెచ్‌ఎఫ్‌ఆర్ ఐడీ(హెల్త్‌కేర్ ఫెసిలిటీ రిజిస్ట్రీ ఐడింటిఫికేషన్)ని కూడా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు క్రియేట్ చేశారు. ఈ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.
ఉపయోగాలెన్నో..
రోగి అభా నెంబరుకు అన్ని వివరాలు లింక్ అయి ఉండడంతో, ఆ వ్యక్తి ఆసుపత్రికి వచ్చిన ప్రతీసారి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. ఆసుపత్రులు, డాక్టర్ల వివరాలు అందుబాటులో ఉండడంతో రోగి తనకు నచ్చిన ఆసుపత్రిలో నచ్చిన వైద్యుడి దగ్గర చికిత్స పొందే అవకాశం ఉంటుంది. స్పెషలిస్ట్‌ల సేవలు కూడా పొందవచ్చు. దీంతో రోగికి సమయం వృథా కాకుండా ఉంటుంది.
ప్రైవేట్ ఆస్పత్రుల్లో పరిస్థితి ఏంటి?
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో అమలు జరగడం లేదు. ఈ మిషన్‌లోకి ఎవరినీ బలవంతంగా తీసుకురాకూడదనే నిబంధన ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో వాటిని ఇందులోకి స్వచ్ఛందంగా తీసుకురావడానికి అధికారులు ప్రయత్నిస్తు న్నారు. ఉపయోగాలను వివరిస్తుండడంతో ఇప్పుడిప్పుడే కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ముందుకు రావడానికి అంగీకరించాయి. కొన్నింటినైనా తీసుకురాగలిగితే మిగతా వారు కూడా రావడానికి అవకాశం ఉందని జిల్లా పొగ్రాం మానిటరింగ్ ఆఫీసర్ రవీందర్ అభిప్రాయపడ్డారు.