డబ్బుల పంపిణీ.. మందు సరఫరా!
ABN , Publish Date - Nov 05 , 2026 | 12:21 AM
Distribution of Rs 500–1000 per vote ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు నగదు, మద్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉన్న స్థానాల్లో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార, ప్రతిపక్ష అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడటం లేదు.
ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థుల పోటాపోటీ
నరసన్నపేటలో నిత్యావసర సరుకుల పంపిణీ
ఓటుకు రూ.500-1000 వరకు.. మందుబాబులకు క్వార్టర్
వలస ఓటర్ల రాకపోకల ఖర్చులూ అభ్యర్థులవే
శ్రీకాకుళం క్రైం/ నరసన్నపేట/పొందూరు, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అభ్యర్థులు నగదు, మద్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉన్న స్థానాల్లో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార, ప్రతిపక్ష అభ్యర్థులు ఖర్చుకు వెనుకాడటం లేదు. నరసన్నపేట పట్టణంలోని ఓ ప్రాదేశిక నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఇంటింటికీ రేషన్ సరుకులు పంపిణీ చేసినట్లు తెలిసింది. మరికొన్ని స్థానాల్లో ఓటుకు రూ.500 చొప్పున నగదు అందించడంతోపాటు మందుబాబులకు క్వార్టర్ మద్యం సీసాలు పంపిణీ చేస్తున్నారు. పొందూరు మండలంలోనూ మూడు రోజులుగా మద్యం పంపిణీ జరుగుతుండగా.. మంగళ, బుధవారాల్లో నగదు పంపిణీ ముమ్మరమైంది. ఓటుకు రూ.500 నుంచి 1000 వరకు, కొన్ని చోట్ల ఇంటికి రూ.1000-1500 వరకు ఇస్తున్నట్లు ప్రచారం ఉంది. గతంలో నగదు తీసుకునేందుకు నిరాకరించిన ఇళ్లకు సైతం అభ్యర్థులు నేరుగా వెళ్లి డబ్బులు అందిస్తున్నారు. మద్యం కోరిన వారికి సీసాలు ఇస్తున్నారు. ఏకగ్రీవమైన ఎంపీటీసీ స్థానాల్లోనూ జడ్పీటీసీ ఎన్నిక ఉండటంతో అక్కడ కూడా నగదు, మద్యం పంపిణీ కొనసాగుతోంది.
వలస ఓటర్లపైనా అభ్యర్థులు ప్రత్యేక దృష్టి సారించారు. దూర ప్రాంతాల్లో ఉన్నవారిని రప్పించేందుకు బస్సు, రైలు చార్జీలతోపాటు అదనంగా కొంత మొత్తాన్ని ఫోన్‌పే ద్వారా పంపిస్తున్నారు. దీంతో ఒక్కో వలస ఓటరుపై రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని స్థానాల్లో వలస ఓటర్లే గెలుపోటములను నిర్ణయించే పరిస్థితి ఉండటంతో వారిని రప్పించేందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదు. మరోవైపు నరసన్నపేటలో ఇటీవల జరిగిన పట్టణ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు మరింత ధీమాగా ఉన్నారు. ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను దక్కించుకోవాలనే లక్ష్యంతో ప్రత్యర్థి పార్టీ కూడా ఓటర్లను ఆకట్టుకునేందుకు భారీగా ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇరు పార్టీల అభ్యర్థుల నుంచి తాయిలాలు అందుకుంటున్న ఓటర్లు మాత్రం తమకే ఓటేస్తామని హామీ ఇస్తున్నట్లు సమాచారం.
ఒప్పంగిలో రూ.7.90 లక్షలు స్వాధీనం
స్థానిక ఎన్నికల నేపఽథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదును సమకూర్చినట్టు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్‌కు వచ్చిన సమాచారంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శ్రీకాకుళం మండలం ఒప్పంగిలో.. వైసీపీ సానుభూతిపరుడు మంత్రి శంకర్ నివాసంలో బుధవారం రాత్రి పోలీసులు సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రూ.7.90 లక్షలు నగదు పట్టుబడింది. దీనికి సంబంధించి సరైన లెక్కలు, ఆధారాలు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఈ నగదును సమకూర్చినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ఎన్నికల కమిషన్‌తోపాటు ఆదాయపు పన్ను శాఖకు నివేదిక సమర్పించినట్టు డీఎస్పీ ధనుంజయనాయుడు తెలిపారు. తనిఖీల్లో డీఎస్పీతోపాటు టౌన్ సీఐ రామకృష్ణ, ఎస్‌ఐలు సురేష్, గంగరాజు పాల్గొన్నారు.