వివాదాల భూములు
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:47 PM
Allotment of lands given to one person to another పలాస నియోజకవర్గంలోని ప్రభుత్వ, డీ పట్టా భూములు వివాదాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఒకరికి ఇచ్చిన భూములను మరొకరికి కేటాయించడం, మరికొన్ని ప్రాంతాల్లో జిరాయితీ భూములుగా మార్పుచేసి అమ్మకాలు సాగించడం, ఇంకొన్నిచోట్ల ఆర్మీ ఉద్యోగుల పేరుతో పట్టాలను సృష్టించి నిరభ్యంతర పత్రాలు పొందడం, కాలువ, చెరువు భూములను ఆక్రమించి పక్కాగా గృహాలు నిర్మించడంతో తరచూ ఆయా ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి.
ఒకరికి ఇచ్చినవి మరొకరికి కేటాయింపు
జిరాయితీలుగా మార్పుచేసి విక్రయాలు
పట్టాలు సృష్టించి గృహాల నిర్మాణం
తరచూ ఆయా ప్రాంతాల్లో ఘర్షణలు
ప్రభుత్వం స్పందిస్తేనే పరిష్కారం
ఇదీ పలాస నియోజకవర్గంలో పరిస్థితి
పలాస, జనవరి 1(ఆంధ్రజ్యోతి): పలాస నియోజకవర్గంలోని ప్రభుత్వ, డీ పట్టా భూములు వివాదాలకు కేంద్రాలుగా మారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఒకరికి ఇచ్చిన భూములను మరొకరికి కేటాయించడం, మరికొన్ని ప్రాంతాల్లో జిరాయితీ భూములుగా మార్పుచేసి అమ్మకాలు సాగించడం, ఇంకొన్నిచోట్ల ఆర్మీ ఉద్యోగుల పేరుతో పట్టాలను సృష్టించి నిరభ్యంతర పత్రాలు పొందడం, కాలువ, చెరువు భూములను ఆక్రమించి పక్కాగా గృహాలు నిర్మించడంతో తరచూ ఆయా ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. రెవెన్యూ యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకుంటే తప్పా ఈ వివాదాలు పరిష్కారమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
బొడ్డపాడు రెవెన్యూ పరిధిలో..
బొడ్డపాడు రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 67లో 198 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 150 ఎకరాలు ఎంఐజీ గృహాలకు కేటాయించగా, మరికొన్ని భూముల్లో ప్రభుత్వ గృహ సముదాయం నిర్మించారు. మిగిలిన భూమి ఖాళీగానే ఉంది. ఇందులో తమకు ఐదు ఎకరాలు ఉందని ఇద్దరు వ్యాపారులు కంచె ఏర్పాటు చేశారు. అయితే, ఈ భూమిలో తనకు 10 సెంట్లు భూమి ఉందని కాశీబుగ్గకు చెందిన మరో వ్యాపారి రికార్డులు చూపించడంతో పాటు కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకువచ్చాడు. దీంతో వీరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి చివరకు సమస్య పోలీసు స్టేషన్ వరకూ వెళ్లింది. ఇదిలా ఉండగా కొందరు ఆ భూమిని గతంలో జిరాయితీగా మార్పిడి చేసి 50 మందికి పైగా స్థలాలను విక్రయించారు. ప్రస్తుతం వారంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తుండడంతో వివాదం ముదిరింది. ఈ స్థలంలో అమ్మవారి ఆలయ నిర్మాణానికి 80 సెంట్లు ప్రభుత్వం కేటాయించిందని బొడ్డపాడు గ్రామానికి చెందిన పెద్దలు రావడంతో వివాదం ముదిరి పాకానపడి శాంతిభద్రతల సమస్యగా మారింది. ఇదే ప్రాంతంలో పాత జాతీయరహదారి కూడా తమదే అంటూ కొందరు వ్యక్తులు నేరుగా కంచె ఏర్పాటు చేయడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. అదేవిధంగా అటవీశాఖ పరిధిలో ఉన్న మెండు జీడి భూములకు ఆనించి ఉన్న మొత్తం ఐదు ఎకరాలు కూడా వివాదాల్లో ఉంది. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉంది.
ఉజ్జుడు మెట్ట భూమి 30 ఎకరాలకు పైగా ఉంటుంది. దీని విలువ రూ.వంద కోట్ల పైమాటే. ఈ భూమి మందస జమిందారులకు చెందినది. ఈ భూమికి దానపట్టా ఉందని గతంలో ఓ వ్యక్తి నుంచి మరొకరు కొనుగోలు చేసి ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు విక్రయించాడు. అయితే, ఈ స్థలం మావోయిస్టులకు కేటాయించారని, దీనిపై ఎవరు క్రయవిక్రయాలు జరిపినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని మావోల పేరుతో హెచ్చరికలు రావడంతో సంబంధిత రియల్‌ఎస్టేట్ సంస్థ వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇక్కడ భూమి వివాదాంశంగా మారింది. ఇది ఎవరి భూమి అనే విషయాన్ని రెవెన్యూ అధికారులు నిర్ధారించాల్సి ఉంది.
ఆరు ఎకరాలకు పైగా ఉన్న నెమలి కొండ కాలువ భూములు అక్రమార్కుల చేతికి చిక్కి నామరూపాలు లేకుండా పోయాయి. పదేళ్ల నుంచి ఈ భూములు క్రయవిక్రయాలు జరుగుతున్నా అధికారుల్లో మాత్రం చలనం లేదు. కాలువ భూములను జిరాయితీలుగా మార్పుచేసి రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి. రూ.100 కోట్ల విలువైన భూమి ఇక్కడ అమ్మకాలు జరిగాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించుకోవచ్చు. గతంలో సాక్ష్యాత్తు జిల్లా సబ్‌కలెక్టర్ ఈ ప్రాంతాన్ని సందర్శించి మొత్తం 120కు పైగా అక్రమ భవనాలను గుర్తించారు. అవన్నీ కాలువ భూములే అని నిర్ధారించినా ఇప్పటి వరకూ చర్యలు లేవు.
రాజగోపాలపురం రహదారిలో కొండపోరంబోకు భూమి ఆక్రమణకు గురవుతోంది. కొండను తవ్వి కంకర, రాళ్లు తరలించడం ఒక ఎత్తయితే, మిగిలిన భూముల్లో పంటలు పండించి సొంతం చేసుకోవడం మరో ఎత్తు. పలాస నుంచి లొద్దభద్ర గ్రామానికి వెళ్లే మార్గమంతా ఇదే పరిస్థితి నెలకొంది. నాలుగేళ్ల నుంచి ఇక్కడ అక్రమ తవ్వకాలు చేపట్టడం, అందులో పంటలు వేసుకోవడం జరుగుతున్నా రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తుంది.
పురుషోత్తపురం ఎర్రచెరువు విస్తీర్ణం 30 ఎకరాలకు పైగా ఉంటుంది. ఇందులో చెరువు పోరంబోకు భూములన్నీ ఒక పద్ధతి ప్రకారం ఆక్రమించుకొని అమ్మకాలు చేస్తున్నవారు కొందరయితే, పక్కా గృహాలు నిర్మించిన వారు మరికొందరు ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో జోరుగా క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో అక్రమంగా నిర్మిస్తున్న మూడు గృహాలను అధికారులు కూల్చివేశారు. అయినా ఆక్రమణదారుల మాత్రం విడిచిపెట్టడం లేదు. స్థలాలను ముందుగా చదును చేయడం, తరువాత అభ్యంతరాలు లేకపోతే పక్కా గృహాలు నిర్మించడం చేస్తున్నారు.