కొబ్బరికి తెగుళ్లు
ABN , Publish Date - Jun 13 , 2026 | 11:56 PM
Coconut crop destroyed at the seedling stage ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి పంటకు తెగుళ్ల తాకిడి అధికమైంది. మొక్క దశలోనే కొబ్బరి చెట్టు నాశనమౌతోంది. ఫలితంగా దిగుబడి తగ్గి.. రైతులకు తీరని నష్టం మిగులుతోంది.
తెల్లదోమ, కాండం తొలుచు పురుగుల వ్యాప్తి
మొక్కదశ లోనే నాశనం
తగ్గుతున్న దిగుబడిపై రైతుల ఆందోళన
కవిటి, జూన్ 13(ఆంధ్రజ్యోతి): ఉద్దానం ప్రాంతంలో కొబ్బరి పంటకు తెగుళ్ల తాకిడి అధికమైంది. మొక్క దశలోనే కొబ్బరి చెట్టు నాశనమౌతోంది. ఫలితంగా దిగుబడి తగ్గి.. రైతులకు తీరని నష్టం మిగులుతోంది. కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం, సోంపేట మండలాల్లో 32వేల ఎకరాల్లో కొబ్బరితోటలు సాగు చేస్తున్నారు. ఒకప్పుడు ఉద్దానం ప్రాంత కొబ్బరికాయలు.. నాణ్యమైన దిగుబడికి ప్రసిద్ధి. కానీ 1999లో ఏర్పడిన తుఫాన్ అనంతరం ఎర్రనల్లి సోకి కాయ పరిమాణం, నాణ్యత దెబ్బతింది. కొన్నేళ్ల తర్వాత కొంతమేర రైతులు కోలుకుంటున్న తరుణంలో 2018 అక్టోబరులో తితలీ తుఫాన్ తాకిడితో వారి బతుకు చిన్నాభిన్నమైంది. తితలీ ఉధృతికి వేలాది కొబ్బరిచెట్లు నేలకూలాయి. వాటి స్థానంలో కొత్తగా మొక్కలు వేసినా తెగుళ్లతో దెబ్బతింటున్నాయి. తెల్లదోమ, కాండం తొలుచు పురుగుల కారణంగా కొబ్బరి పంటకు నష్టం వాటిల్లుతోంది. కొబ్బరిపంటను తెల్లదోమ నాశనం చేస్తోంది. పచ్చని కమ్మలకు దిగువబాగంలో గూడు కట్టుకొని ఈ దోమ ఉంటుంది. అడుగుబాగంలో తెల్లని నూలుపోగులాంటి జిగురు పదార్థాన్ని విసర్జిస్తున్నాయి. దీనిపై నల్లని శిలీంద్రం సోకటంతో కమ్మల్లో పచ్చదనాన్ని పీల్చేస్తున్నాయి. మూడేళ్లుగా వర్షాబావ పరిస్థితుల కారణంగా తెల్లదోమ విజృంభణ పెరిగింది. మరోవైపు కాండం తొలుచు పురుగు.. రైతులను భయపెడుతోంది. మొక్కదశలో కాండాన్ని తొలచి తియ్యని పదార్థాన్ని తినే కొమ్ము, ఎర్రముక్కు పురుగుల ఉధృతి అధికంగా ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ పురుగుల నివారణ సాధ్యం కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరి మొక్క నాటిన పదేళ్ల వరకు దిగుబడి రాదు. అటువంటిది ఈ పరుగు మొక్కదశలోనే సోకి నాశనం చేస్తోంది. మొక్కల సంరక్షణ భారమవుతోందని రైతులు వాపోతున్నారు.
మళ్లీ నల్లముట్టి..
నల్లముట్టి తెగులు కొబ్బరిచెట్టులో పచ్చదనాన్ని తినేస్తుంది. చెట్ల కమ్మలు ఎండిపోయి ఈనెలు మాత్రమే కనిపిస్తుంటాయి. ఈ తెగులు సోకితే పంట దిగుబడి తగ్గిపోతుంది. 1989 ప్రాంతంలో ఉద్దానం ప్రాంతంలో తోటలకు ఈ తెగులు సోకి చెట్లను నాశనం చేసింది. తర్వాత వర్షాలు అధికంగా కురవడంతో దశలవారీగా దీని ఉధృతి తగ్గింది. ప్రస్తుతం కంచిలి మండలంలోని కొబ్బరితోటలకు ఈ తెగులు ఆశించటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి తెగుళ్ల బెడద నుంచి కొబ్బరి పంటకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
నివారణ చర్యలు చేపట్టాలి
కొబ్బరి పంటకు తెగుళ్లు తాకిడి అధికంగా ఉంది. కొండం తొలుచు పురుగు ఉధృతి అధికమై మొక్కల సంరక్షణ భారమవుతోంది. తెగుళ్ల నివారణకు అధికారులు చర్యలు చేపట్టి.. రైతులను ఆదుకోవాలి.
ఎ.త్రివిక్రమరావు, కొబ్బరి రైతు, కవిటి
సహకారం అందించాలి
కొబ్బరి తోటల నుంచి ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. కొబ్బరిచెట్లకు తెగుళ్ల తాకిడితో మరింతగా దిగుబడి దిగజారుతోంది. తెల్లదోమ, కొమ్ముపురుగుల నివారణకు సహకారం అందించాలి. రైతులకు మేలు జరిగేలా పంట అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి.
టి.మోహనరావు, రైతు, కవిటి