Share News

వైకల్యం ఓడింది

ABN , Publish Date - Apr 16 , 2026 | 12:57 AM

అంగవైకల్యమని ఇంటిలో కూర్చోకుండా ఏదో ఒక రంగంలో రాణించాలనుకున్నాడు ఆ విద్యార్థి.

  వైకల్యం ఓడింది
జ్ఞానసాయి

- ఎవరెస్టు బేస్‌ క్యాంపునకు ఎంపికైన దివ్యాంగ విద్యార్థి జ్ఞానసాయి

-అభినందించిన విద్యాశాఖ మంత్రి లోకేష్‌

మెళియాపుట్టి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): అంగవైకల్యమని ఇంటిలో కూర్చోకుండా ఏదో ఒక రంగంలో రాణించాలనుకున్నాడు ఆ విద్యార్థి. పుట్టుకతోనే పక్కటి ఎముకలు చిన్నవి కావడంతో నడవడానికి ఆ విద్యార్థి ఇబ్బందులు పడుతుంటాడు. అయినా వైకల్యాన్ని ఎదిరించి గత రెండేళ్ల నుంచి క్రీడలతో పాటు చదువులో రాణిస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. చాపర జిల్లా పరిషత్‌ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న వెలుగు జ్ఞానసాయి విభిన్న ప్రతిభావంతుల ఎవరెస్టు బేస్‌ క్యాంప్‌ యాత్రకు ఎంపికయ్యాడు. జ్ఞానసాయిది హీరపురం గ్రామం. తండ్రి కిరణ్‌ నాలుగేళ్ల కిందట మృతి చెందాడు. తల్లి పద్మ అంగన్‌వాడీ హెల్పర్‌గా పనిచేస్తోంది. జ్ఞానసాయికి ఎడమవైపు పక్కట ఎముకలు చిన్నవిగా ఉంటాయి. దీంతో వెన్నుపూస కూడా వంకగా ఉంటుంది. రన్నింగ్‌తో పాటు వ్యాయామం చేస్తే ఎముకలు పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకున్నాడు. జిల్లా స్థాయిలో దివ్యాంగుల క్రీడల్లో పాల్గొని ఎన్నో పతకాలు సాధించాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా పలు పతకాలు పొందాడు. ఈ ఏడాది జనవరిలో జిల్లా స్థాయిలో ఎవరెస్టు బేస్‌ క్యాంపునకు ఎంపికలు జరిగాయి. జిల్లా నుంచి 100 పాల్గొనగా ఇద్దరు ఎంపికయ్యారు. ఇందులో జ్ఞానసాయి ఉన్నాడు. గండికోట, లడక్‌లో 12 రోజుల చొప్పున శిక్షణ పొందాడు. నేపాల్‌లో ఈనెల 15 నుంచి 30 వరకు 16 రోజుల పాటు సాహసయాత్ర చేయనున్నాడు. 5,364 మీటర్ల ఎత్తులోని ఎవరెస్టు బేస్‌ క్యాంపునకు వెళ్లనున్నాడు. జ్ఞానసాయితో పాటు బేస్‌ క్యాంపునకు ఎంపికైన విద్యార్థులు మంగళవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. జ్ఞానసాయికి గ్రామస్థులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

Updated Date - Apr 16 , 2026 | 12:57 AM