నాడు తప్పులు - నేడు తిప్పలు
ABN , Publish Date - May 23 , 2026 | 12:20 AM
In narrow canals నాడు అధికారులు చేసిన తప్పులకు ప్రస్తుతం పారిశుధ్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇరుకైన కాలువల్లో పేరుకుపోయిన పూడికలు తీయడానికి ఆపసోపాలు పడుతున్నారు. పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలోని కేటీ రోడ్డు, ఇందిరాజంక్షన్ నుంచి మొగిలిపాడు గ్రామం వరకూ వైసీపీ ప్రభుత్వ హయాంలో రహదారులు, కాలువలు నిర్మించారు.
ఇరుకైన కాలువల్లో పూడికతీతకు ఇబ్బందులు
రహదారులపైనే మురుగునీటితో అవస్థలు
పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధి కేటీ రోడ్డు అప్పయ్యదొర మార్గ్‌లో ఉన్న ప్రధాన కాలువ ఇది(పైచిత్రం). కనీసం ఐదు అడుగుల వెడల్పు ఉండాల్సిన ఈ కాలువ కేవలం మూడు అడుగులు మాత్రమే ఉంది. దీనికి మురుగునీరు బయటకు వెళ్లేందుకు మార్గం లేదు. దీంతో కాలువల్లో పూడికలు పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అనాలోచితంగా నిర్మాణాలు చేపట్టడంతో తమకు ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పలాస, మే 22(ఆంధ్రజ్యోతి): నాడు అధికారులు చేసిన తప్పులకు ప్రస్తుతం పారిశుధ్య సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇరుకైన కాలువల్లో పేరుకుపోయిన పూడికలు తీయడానికి ఆపసోపాలు పడుతున్నారు. పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలోని కేటీ రోడ్డు, ఇందిరాజంక్షన్ నుంచి మొగిలిపాడు గ్రామం వరకూ వైసీపీ ప్రభుత్వ హయాంలో రహదారులు, కాలువలు నిర్మించారు. భవిష్యత్‌లో కనీసం 30 ఏళ్లకు సరిపడా అంచనాలు నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా.. అనాలోచితంగా పనులు చేపట్టారు. ఇప్పటికీ రోడ్డు పనులు పూర్తికాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కాలువల పరిస్థితి దయనీయంగా మారింది. రోడ్డుకు ఇరువైపులా కాలువలు కనీసం ఆరు అడుగుల వెడల్పుతోనైనా నిర్మించాలి. కానీ అప్పటి పాలకులు, అధికారుల అనాలోచిత నిర్ణయంతో కొన్ని ప్రాంతాల్లో మూడు అడుగులకు కుదించారు. మరికొన్ని ప్రాంతాల్లో అడుగు వెడల్పుతోనే కాలువ నిర్మించి.. మమ అనిపించారు. ప్రస్తుతం చిన్న వర్షం కురిసినా కాలువల్లో ప్రవహించాల్సిన మురుగునీరు రోడ్లపైకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కాలువలకు లింకు లేకపోవడంతో.. మురుగు నిల్వ ఉండి పేరుకుపోతోంది. ప్రస్తుతం ఈ కాలువల్లో పూడిక తీసి, డంపింగ్ చేయడానికి సిబ్బంది వ్యయప్రయాస పడుతున్నారు. ఈ కాలువలు పనికిరాని విధంగా ఉన్నాయని, మళ్లీ కొత్తవి నిర్మించాలంటే మునిసిపాలిటీకి తడిసిమోపెడు అవుతుందని ఇంజనీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. వర్షాకాలంలో వీటి పరిస్థితిని చూసి కొత్తవి నిర్మించేందుకు అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మాస్టర్‌ప్లాన్ అమలవుతున్న తరుణంలో భవిష్యత్తులో ఇబ్బందులులేని విధంగా కాలువలు నిర్మించాలని పలువురు కోరుతున్నారు.
శాశ్వత పరిష్కారానికి కృషి
కాలువలు చిన్నవి కావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం పూడుకుపోయిన చెత్తను తొలగిస్తున్నాం. జగన్నాథసాగరం చెరువు వద్ద 2.6 ఎకరాల విస్తీర్ణంలో మాస్టర్ ప్లాంట్ నిర్మాణం చేపడతాం. మొత్తం కాలువల్లో ప్రవహించే నీరంతా పైపులైన్లు ద్వారా అక్కడకు పంపించి వాటిని శుద్ధి చేసి చెరువుల్లోకి, పంట పొలాలకు అందించే కార్యక్రమం చేపడుతున్నాం. ప్రభుత్వం రూ.22కోట్ల నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే శాశ్వత మురుగునీటికి పరిష్కారం లభించినట్లే.
- ఇ.శ్రీనివాసులు, కమిషనర్, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ