‘తల్లికి వందనం’ రాలేదా.. దిగులొద్దు
ABN , Publish Date - Jul 27 , 2026 | 11:45 PM
Acceptance of complaints until August 3 ‘తల్లికి వందనం’ పథకంలో అర్హత ఉండి డబ్బులు జమకాని విద్యార్థుల తల్లులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. అర్హులు, అన్హరుల జాబితాలను స్వర్ణగ్రామ, వార్డు కార్యాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. లబ్ధిదారుల నుంచి ఆగస్టు 3 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరిస్తారు.
మరో అవకాశం కల్పించిన ప్రభుత్వం
ఆగస్టు 3 వరకు ఫిర్యాదుల స్వీకరణ
శ్రీకాకుళం ఎడ్యుకేషన్, జూలై 27(ఆంధ్రజ్యోతి): ‘తల్లికి వందనం’ పథకంలో అర్హత ఉండి డబ్బులు జమకాని విద్యార్థుల తల్లులకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. అర్హులు, అన్హరుల జాబితాలను స్వర్ణగ్రామ, వార్డు కార్యాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. లబ్ధిదారుల నుంచి ఆగస్టు 3 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఆ ఫిర్యాదులను ఆగస్టు 4 నుంచి 10 వరకు పరిశీలించి అదనపు అర్హుల జాబితాను అధికారులు సిద్ధం చేయనున్నారు. కొత్తగా అర్హులుగా గుర్తించిన విద్యార్థులతోపాటు ఒకటో తరగతి, జూనియర్ ఇంటర్‌లో తాజాగా చేరిన విద్యార్థుల జాబితాలను ఆగస్టు 30న విడుదల చేయనున్నారు. అదేరోజు అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఒకటో తరగతి, జూనియర్ ఇంటర్‌లో కొత్తగా చేరే విద్యార్థులు ప్రవేశాలకు ఆగస్టు 25 వరకు గడువు నిర్ణయించింది. ఆలోపు ప్రవేశాలు పూర్తి చేసుకున్నవారు అవసరమైన పత్రాలతో సంబంధిత స్వర్ణ కార్యాలయాలను సంప్రదించాలని అధికారులు సూచించారు.
చెక్ చేసుకోండి
‘తల్లికి వందనం’ పథకం కింద బ్యాంకు ఖాతాలో డబ్బులు జమయ్యాయో.. లేదో.. లీప్‌యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లోని లీప్‌యాప్‌లో పేరెంట్ లాగిన్ ద్వారా సైన్‌ఇన్ ఇవ్వాలి. అక్కడ ‘తల్లికి వందనం’ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే నగదు జమయిందో లేదో వివరాలు వివరాలు కనిపిస్తాయి. అన్‌లైన్ పోర్టల్ ద్వారా కూడా ఈ సమాచారం తెలుసుకోవచ్చు. డబ్బులు జమ కాకపోతే బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం, ఎన్‌పీసీఐ మ్యాపింగ్ యాక్టివ్‌గా ఉందో లేదో సరిచూసుకోవాలి. గ్రామ, వార్డు సచివాలయాల వెల్ఫేర్ అసిస్టెంట్‌ను సంప్రదించాలి.
ఆర్టీఈ దరఖాస్తుదారులకు షాక్
ఆర్టీఈ ప్రవేశాల కింద ప్రైవేటు పాఠశాలలో ఉచిత సీటు దరఖాస్తుల చేసుకున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకం ద్వారా రూ.1,500 మాత్రమే జమైంది. జిల్లాలో ఈ ఏడాది 3,400 మందికిపైగా విద్యార్థులు ఆర్టీఈ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కేవలం 1100 మంది మాత్రమే ప్రైవేటు పాఠశాలల్లో చేరారు. మిగిలిన వారు చేరలేదు. ఆయా తల్లుల ఖాతాల్లో రూ.1,500 మాత్రమే జమకావడంతో ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఎంఈవో కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదు చేశారు. పరిశీలించి మిగతా సొమ్ము జమ చేసేలా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ, సమగ్రశిక్షాభియాన్‌శాఖ అధికారులు తెలిపారు.