నోటాలో సగం కూడా రాలే!
ABN , Publish Date - Nov 10 , 2026 | 11:48 PM
Congress suffers defeat in ZPTC elections రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పతనం ఏ స్థాయికి చేరిందో జిల్లా పరిషత్(జడ్పీటీసీ) ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. దశాబ్దాల చరిత్ర కలిగిన జాతీయ పార్టీకి వచ్చిన ఓట్ల కంటే నోటాకు రెట్టింపు ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులందరికీ కలిపి వచ్చిన ఓట్లలో సగం కూడా కాంగ్రెస్ సాధించలేకపోయింది.
జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఘోర పరాభవం
30 స్థానాలకుగానూ 15 చోట్లే పోటీ
కాంగ్రెస్కు 5,133 ఓట్లు.. నోటాకు 10,437 ఓట్లు
స్వతంత్రుల ఓట్లలోనూ సగం కూడా రాని వైనం
శ్రీకాకుళం, నవంబరు 10(ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పతనం ఏ స్థాయికి చేరిందో జిల్లా పరిషత్(జడ్పీటీసీ) ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. దశాబ్దాల చరిత్ర కలిగిన జాతీయ పార్టీకి వచ్చిన ఓట్ల కంటే నోటాకు రెట్టింపు ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులందరికీ కలిపి వచ్చిన ఓట్లలో సగం కూడా కాంగ్రెస్ సాధించలేకపోయింది. జిల్లాలో ఒక్క జడ్పీటీసీ స్థానాన్నీ కైవసం చేసుకోలేకపోయింది. పోటీ చేసిన స్థానాల్లోనూ పార్టీ కనీస ప్రభావం చూపలేకపోవడం ఆ పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది.
బరిలో నిలిచింది సగం స్థానాల్లోనే!
జిల్లాలో మొత్తం 30 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్ కేవలం 15 స్థానాల్లోనే అభ్యర్థులను నిలిపింది. మిగిలిన 15 స్థానాల్లో పోటీకి అభ్యర్థులు కూడా దొరకలేదు. ఎన్నికల కౌంటింగ్లో వెల్లడైన గణాంకాల ప్రకారం జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్కు కేవలం 5,133 ఓట్లు మాత్రమే వచ్చాయి. అదే సమయంలో నోటాకు 10,437 ఓట్లు పోలయ్యాయి. అంటే కాంగ్రెస్ సాధించిన ఓట్లకు దాదాపు రెట్టింపు ఓట్లు నోటాకు దక్కాయి. ఇక స్వతంత్ర అభ్యర్థులందరికీ కలిపి 13,046 ఓట్లు వచ్చాయి. ఇండిపెండెంట్లతో పోల్చినా కాంగ్రెస్ వెనుకబడింది. ఒక్క స్థానంలోనూ గెలవకపోవడంతో జిల్లాలో పార్టీ పరిస్థితి మరింత దిగజారినట్లు స్పష్టమవుతోంది.
8 మండలాల్లో నోటాదే పైచేయి
కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేసిన 15 స్థానాల్లో 8 మండలాల్లో ఆ పార్టీ కంటే నోటాకే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. కంచిలిలో కాంగ్రెస్కు 125 ఓట్లు రాగా.. నోటాకు 305 వచ్చాయి. కవిటిలో కాంగ్రెస్కు 265, నోటాకు 458 ఓట్లు లభించాయి. లావేరులో కాంగ్రెస్కు 226 ఓట్లు రాగా.. నోటాకు 349 వచ్చాయి. గారలో కాంగ్రెస్ 368 ఓట్లకే పరిమితం కాగా.. నోటాకు 456 ఓట్లు పోలయ్యాయి. ఆమదాలవలసలో కాంగ్రెస్కు 208, నోటాకు 274 ఓట్లు వచ్చాయి. పొందూరులో కాంగ్రెస్కు 266, నోటాకు 379 ఓట్లు లభించాయి. రణస్థలంలో కాంగ్రెస్కు 351 ఓట్లు రాగా.. నోటాకు 377 ఓట్లు వచ్చాయి. జలుమూరులో కాంగ్రెస్కు 173 ఓట్లు మాత్రమే రాగా.. నోటాకు 247 ఓట్లు పోలయ్యాయి. ఎచ్చెర్లలో 564, జి.సిగడాంలో 934, నరసన్నపేటలో 808 ఓట్లు సాధించినప్పటికీ.. మిగిలిన ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభావం అంతంతమాత్రంగానే కనిపించింది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో.. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన కాంగ్రెస్.. రాష్ట్ర విభజన తర్వాత ప్రజాదరణ కోల్పోయింది. ఇన్నేళ్లయినా పార్టీ పరిస్థితిలో మార్పు రాకపోగా.. తాజా జడ్పీటీసీ ఫలితాలు ఆ పతనాన్ని మరోసారి చాటిచెప్పాయి.