పండు అని తిన్నారో..
ABN , Publish Date - May 30 , 2026 | 11:56 PM
Traders cheating with chemicals జిల్లాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా నిగనిగలాడే మామిడి పండ్లు కనిపిస్తున్నాయి. కానీ ఈ నిగనిగ వెనుక ప్రజారోగ్యానికి విఘాతం కలిగించే ప్రమాదం పొంచి ఉంది. మామిడి కాయలను అత్యంత ప్రమాదకరమైన కాల్షియం కార్బైడ్‌తో పాటు ఇథిలిన్, సల్ఫర్ వంటి రసాయనాలతో మగ్గించి వ్యాపారులు విక్రయిస్తున్నారు.
రసాయనాలతో మగ్గిస్తున్న వ్యాపారులు
జిల్లాలో యథేచ్ఛగా విక్రయాలు
ప్రజారోగ్యానికి తూట్లు
రణస్థలం, మే 30(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా నిగనిగలాడే మామిడి పండ్లు కనిపిస్తున్నాయి. కానీ ఈ నిగనిగ వెనుక ప్రజారోగ్యానికి విఘాతం కలిగించే ప్రమాదం పొంచి ఉంది. మామిడి కాయలను అత్యంత ప్రమాదకరమైన కాల్షియం కార్బైడ్‌తో పాటు ఇథిలిన్, సల్ఫర్ వంటి రసాయనాలతో మగ్గించి వ్యాపారులు విక్రయిస్తున్నారు. దీంతో పండ్లలో పోషకాలు తగ్గడమే కాకుండా అవి విషపూరితంగా మారుతున్నాయి. ఒక్క మామిడికే కాదు.. అరటి, సపోట, బొప్పాయి. ఏపిల్, జామ.. ఇలా అన్నింటికీ రసాయనాలనే వాడుతున్నారు. చివరకు కాయలను పక్వానికి తెచ్చేందుకు సూదిమందు వాడుతుండడం విచారకరం. కృత్రిమంగా మగ్గబెట్టిన పండ్ల అమ్మకాలను అరిట్టేందుకు శ్రీకాకుళంలోని పలు మార్కెట్లు, దుకాణాలపై ఇటీవల ఆహార భద్రతాశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆహార భద్రతాధికారి కె.లక్ష్మీ నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో మామిడి, అరటిపండ్ల నాణ్యతను పరిశీలించి, అనుమానాస్పదంగా ఉన్న నమమూనాలను సేకరించి స్టేట్‌ఫుడ్ లేబొరేటరీకి పంపారు. ల్యాబ్ నివేదికల్లో రసాయనాల వాడకం తేలితే సదురు వ్యాపారులపై ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006 ప్రకారం కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆమె హెచ్చరించారు.
అదో మాఫియాగా...
జిల్లాలో శ్రీకాకుళం నగరంతోపాటు రణస్థలం, పలాస-కాశీబుగ్గ, ఇచ్ఛాపురం, నరసన్నపేట, టెక్కలి, పాతపట్నం, ఆమదాలవలసలో పండ్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఎక్కడా సంప్రదాయ పద్ధతితో పండ్ల రకాలను మగ్గించే ప్రయత్నం చేయడం లేదు. రసాయనాలను కృత్రిమంగా వినియోగిస్తున్నారు. జిల్లాకేంద్రం శ్రీకాకుళంలో సిండికేట్‌గా ఏర్పడి వ్యాపారులు వీటిని విక్రయిస్తున్నారు. శ్రీకాకుళం డేఅండ్ నైట్ జంక్షన్, పాలిటెక్నిక్ కాలేజీ, పీఎస్‌ఎన్‌ఎం స్కూల్, నరసన్నపేట, టెక్కలి, పలాస కాశీబుగ్గ, ఇచ్ఛాపురం వంటి ప్రాంతాల్లో మగ్గబెట్టే కేంద్రాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ రోజుల తరబడి పండ్లను నిల్వ ఉంచుతారు. డిమాండ్‌ను బట్టి మగ్గబెడతారు. సరఫరా చేస్తారు. సాధారణ రోజుల్లో ప్రతిరోజూ 50 టన్నుల వరకూ అరటిపండ్లు, పది టన్నుల వరకూ ఆపిల్ పండ్లు, కమలాపండ్లు, మూడున్నర టన్నుల వరకూ సపోట, జామి, ఇతరత్రా పండ్లు వినియోగిస్తున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. వేసవిలో మాత్రం దాదాపు 45 రోజులపాటు సగటున 100 టన్నుల మామిడిని విక్రయిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.
ఆరోగ్యంపై ప్రభావం
రసాయనాలతో మగ్గించిన పండ్లను తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. కడుపులో వికారం ఏర్పడి వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడతారు. రక్తహీనత, రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి. చర్మవ్యాధులు సంభవిస్తాయి. తలనొప్పి, అలసట, నరాల సమస్యలు తలెత్తుత్తాయి. ఊపిరితిత్తులు, మూత్రాశయ వ్యాధులు సంక్రమిస్తాయి. మూత్రపిండాలు దెబ్బతినడమే కాకుండా కేన్సర్ వచ్చే అవకాశం ఉంది. మానసిక వ్యాధులు కూడా సంక్రమిస్తాయి. కనురెప్పల వాపు తదితర కంటి సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు. మచ్చలు లేని పండ్లు కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. పండ్లను కాసేపు వేడినీటిలో ఉంచి.. మైనపు పూతలా ఉంటే తొక్కను తీసి గమనించాలని తెలిపారు.
అనారోగ్యం కొని తెచ్చుకున్నట్టే
అజాగ్రత్తతో వ్యవహరించి పండ్లను కొనుగోలు చేస్తే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్టే. రసాయనాలతో మగ్గించిన పండ్ల ప్రభావం ఆరోగ్యంపై ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గుతాయి. మెగ్నీషియం, కార్బన్స్ ప్రభావం ఎక్కువై అనారోగ్యం తలెత్తుతంది. ప్రధాన అవయవాలపై పెను ప్రభావం చూపుతుంది. అందుకే తాజా పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.
- డాక్టర్ యుగంధర్, ఎమ్‌డీ, రణస్థలం