Share News

బంగారం కోసమే చంపేశారా?

ABN , Publish Date - Aug 23 , 2026 | 12:15 AM

Did they kill the elderly woman? నరసన్నపేటలో ఈ నెల 17న అదృశ్యమైన చింతు చిన్నమ్మడు(70)ను గుర్తుతెలియని వ్యక్తులు బంగారం కోసమే చంపేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం హిరమండలం సమీపాన పిండ్రువాడ గెడ్డలో ఓ మూటలో ఆమె మృతదేహం బయటపడింది.

బంగారం కోసమే చంపేశారా?
మూటలో చిన్నమ్మడు మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

ఆరు రోజుల కిందట అదృశ్యమైన వృద్ధురాలు

పిండ్రువాడ గెడ్డలో బయటపడిన మృతదేహం

చీరతో మూటకట్టి గెడ్డలో పడేసిన దుండగులు

పోలీసుల ముమ్మర దర్యాప్తు

నరసన్నపేట/ హిరమండలం, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): నరసన్నపేటలో ఈ నెల 17న అదృశ్యమైన చింతు చిన్నమ్మడు(70)ను గుర్తుతెలియని వ్యక్తులు బంగారం కోసమే చంపేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం హిరమండలం సమీపాన పిండ్రువాడ గెడ్డలో ఓ మూటలో ఆమె మృతదేహం బయటపడింది. జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన చింతు చిన్నమ్మడు ఫ్యామిలీ మెంబర్‌ ధ్రువీకరణ పత్రం కోసం ఈ నెల 17న నరసన్నపేటలో నోటరీ చేయించేందుకు వచ్చి అదృశ్యమైన విషయం తెలిసిందే. ఆమె మరిది సత్యనారాయణ ఫిర్యాదు మేరకు జలుమూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 17న నోటరీ కోసం ఒక మహిళా న్యాయవాది ఇంటికి వెళ్లిన తర్వాత చిన్నమ్మడు జాడ కనిపించలేదని గుర్తించారు. గొట్టిపల్లిలో ఆమె ఫోన్‌సిగ్నల్‌ వచ్చి ఆగిపోయింది. దీని ఆధారంగా నరసన్నపేట సీఐ ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నరసన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట పోలీసులు పలు కోణాల్లో చిన్నమ్మడు అదృశ్యంపై ఆరా తీశారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. కాగా.. ఒంటరిగా వచ్చిన ఆమె వద్ద 15 తులాల వరకు బంగారు ఆభరణాలు ఉన్నట్లు సీసీ కెమెరాల పుటేజీల్లో కనిపించింది. బంగారం కోసం ఆమెను ఎవరో మాయమాటలతో మభ్యపెట్టి చంపేశారని పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యవహారంతో ఎవరెవరి పాత్ర ఉందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

చీరతో మూటకట్టి.. ప్యాకింగ్‌

దుండగులు చిన్నమ్మడు మృతదేహాన్ని చిదిమేసి.. రెండు గోనెసంచుల్లో ప్యాకింగ్‌ చేసి.. చీరతో మూట కట్టేశారు. దానిని గొట్టాబ్యారేజీలో పడివేసేందుకు ముందు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడ సీసీ కెమెరాలు, వాహనాల రాకపోకలు గమనించి.. పిండ్రువాడ సమీపాన కోళ్లఫారం వ్యర్థాలు వేసే పొదలో ఈ మూటను పడేశారు. శనివారం ఆ మృతదేహం గెడ్డలో బయటపడింది. హిరమండలం పోలీసులు సమాచారం ఇవ్వడంతో నరసన్నపేట పోలీసులు, క్లూస్‌టీం అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కాగా.. అదృశ్యమైన రోజు చిన్నమ్మడు పచ్చరంగు చీర ధరించింది. దాని ప్రకారం చిన్నమ్మడు మృతదేహంగా గుర్తించారు. కాగా.. ఆమె ఒంటిపై బంగారం ఆభరణాలు లేకపోవడంతో.. వాటికోసమే దుండగులు హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతదేహాన్ని ప్యాకింగ్‌ చేసిన చీర ఎవరిది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు బంగారం ఆభరణాలు ఎక్కడ ఉన్నాయి? తదితర సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు.

Updated Date - Aug 23 , 2026 | 12:15 AM