డయేరియా అదుపులోకి..
ABN , Publish Date - Feb 26 , 2026 | 12:15 AM
Diarrhea control.. శ్రీకాకుళం నగరం లోని కొన్ని ప్రాంతాల్లో ప్రబలిన డయేరియా అదుపులోకి వచ్చింది. ఆది, సోమ, మంగళవారాల్లో 102 మంది ఆసుపత్రి పాలైనా.. బుధవారం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. డయేరియా ప్రబలిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది.
వేగంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం
సీఎం చంద్రబాబు ఆదేశాలతో కదలిక
నగరపాలక సంస్థ కమిషనర్ సస్పెన్షన్
క్షేత్రస్థాయికి వెళ్లిన జిల్లా అధికారులు
రంగంలోకి 50 పైగా వైద్య బృందాలు
సచివాలయ సిబ్బంది ఇంటింటి సర్వే
‘ప్రైవేటు’లోనూ బాధితులకు ఉచిత చికిత్స
నేటి సాయంత్రానికి నీటి నమూనా రిపోర్టు
శ్రీకాకుళం/కలెక్టరేట్, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరం లోని కొన్ని ప్రాంతాల్లో ప్రబలిన డయేరియా అదుపులోకి వచ్చింది. ఆది, సోమ, మంగళవారాల్లో 102 మంది ఆసుపత్రి పాలైనా.. బుధవారం ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. డయేరియా ప్రబలిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించింది. తక్షణ నివారణ చర్యలకు ఉపక్రమించింది. సీఎం చంద్రబాబు ఇక్కడి పరిస్థితిపై అధికారులతో సమీక్షించారు. అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఎమ్మెల్యే గొండు శంకర్‌ను మంగళవారం రాత్రే ఇక్కడికి పంపించారు. మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ కూడా బుధవారం సాయంత్రం శ్రీకాకుళానికి వచ్చారు. డయేరియా ప్రబలడానికి కారణాలను తెలుసుకున్నారు. నివారణ చర్యలపై అధికారులతో మాట్లాడారు.
యుద్ధప్రాతిపదికన నివారణ చర్యలు
డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో అధికారులు తక్షణ నివారణ చర్యలు చేపట్టారు. ప్రభావిత ప్రాంతాలకు కుళాయిల ద్వారా నీటిసరఫరా నిలిపివేశారు. ట్యాంకర్ల ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తున్నారు. ఏఎన్‌ఎం, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో కూడిన 50 బృందాలను రంగంలోకి దించారు. వీరు ఇంటింటా తిరిగి నీటిని కాచి చల్లార్చి తాగాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, డయేరియా లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి రావాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కలెక్టర్, మునిసిపల్ కమిషనర్, డీఎంహెచ్‌వో ఆయా ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. నీటి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం విశాఖపట్నం, శ్రీకాకుళం ల్యాబ్‌లకు పంపారు.
కలెక్టర్, ఎమ్మెల్యే పర్యటన
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్యెల్యే గొండు శంకర్ బుధవారం ఉదయం డయేరియా ప్రభావిత ప్రాంతాలైన దమ్మలవీధి, కాకివీధి, మంగువారి తోట, గోల్కొండరేవు రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ప్రతి ఇంటికీ వెళ్లి, బాధితులను పరామర్శించి వివరాలను తెలుసుకున్నారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవరసరం లేదని, అన్ని రక్షణ చర్యలు తీసుకున్నామని వారికి భరోసా కల్పించారు. అనంతరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వారి పరిస్థితిపై వైద్యులు, సిబ్బందిని ఆరా తీశారు. ప్రభుత్వం అత్యుత్తమ సేవలందించేందుకు అన్ని చర్యలు తీసుకుందని వారికి ధైర్యం చెప్పారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.
అవాస్తవాలు నమ్మొద్దు
నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రబలిన డయేరియాపై సామాజిక మాధ్యమాలు, ఇతర మార్గాల ద్వారా వస్తున్న అ వాస్తవాలను నమ్మవద్దని కలెక్టర్ ఒక ప్రకటనలో కోరారు. అధికారికంగా ఒక్కరు మాత్రమే మృతి చెందారని తెలిపారు. మిగిలిన వారి మరణాలకు గల కారణాలను విశ్లేషిస్తున్నామని వివరించారు. ‘నగరంలో డయేరియా కేసులు నమోదవుతున్నాయన్న సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై నివారణ చర్యలు చేపట్టింది. మున్సిపల్ కమిషనర్, డీఎంహెచ్‌వోతో కలిసి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాం. పరిస్థితిని సమీక్షించి తక్షణ చర్యలు చేపట్టాం. కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు 50 పైగా వైద్యబృందాలు నిరంతరం క్షేత్రస్థాయిలో పని చేస్తున్నాయి’ అని కలెక్టర్ తెలిపారు.
ఇంటింటి సర్వే
‘సచివాలయ సిబ్బంది, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలతో కూడిన బృందాలు ఇంటింటికీ వెళ్లి సర్వేలు చేస్తున్నాయి. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయి. కలుషిత నీటిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నీటి నమూనాల తుది నివేదికలు సాయంత్రానికి అందుబాటులోకి వస్తాయి. అప్పుడు పూర్తి స్పష్టత వస్తుంది. ప్రజలు భయాందోళనలకు గురి కావల్సిన అవసరం లేదు. కాచి, చల్లార్చిన నీటిని మాత్రమే తాగండి. బాధితులందరి పరిస్థితి నిలకడగా ఉంది. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది’ అని కలెక్టర్ తెలిపారు.
తాగునీటి కోసం బారులు
మంగువారి తోటలోని రామ్‌నగర్, దమ్మలవీధి తదితర డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు బుధవారం ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేశారు. ట్యాంకర్ల వద్ద మహిళలు బిందెలతో బారులుదీరారు.
బాఽధితులకు ‘ప్రైవేటు’లో ఉచిత వైద్యం
శ్రీకాకుళంలో డయేరియా లక్షణాలతో బాధపడితే.. వారికి నగరంలోని ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు అనుమతి ఉన్న ఆసుపత్రులలో ఉచిత వైద్యం అందజేస్తామని జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ అవని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాధితులు నెట్‌వర్క్ ఆసుపత్రులకు వెళ్లి ఉచితంగా వైద్యం పొందాలని కోరారు. ఎలాంటి సహాయం అవసరమైనా 92810 68255, 92810 68256, 92810 68257, 92810 68139 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.