అదుపులోనే డయేరియా
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:21 AM
Diarrhea control శ్రీకాకుళంలోని దమ్మలవీధి, గుడివీధి, మంగువారితోట, కాకివీధి ప్రాంతాల్లో ప్రబలిన అతిసారం ప్రస్తుతం అదుపులోనే ఉందని, ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. మంగళవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు.
ప్రజలు ఆందోళన చెందవద్దు
ఇంటింటి సర్వేతో బాధితుల గుర్తింపు
24 గంటలూ వైద్య సేవలు
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం అర్బన్, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలోని దమ్మలవీధి, గుడివీధి, మంగువారితోట, కాకివీధి ప్రాంతాల్లో ప్రబలిన అతిసారం ప్రస్తుతం అదుపులోనే ఉందని, ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. మంగళవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ‘శ్రీకాకుళంలో ఇప్పటివరకు మొత్తం 52 డయేరియా కేసులు నమోదయ్యాయి. బాధితులను రిమ్స్, కిమ్స్, జెమ్స్ వంటి ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నాం. దురదృష్టవశాత్తూ ఒకరు మృతి చెందారు. ఐదుగురు ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.10లక్షల పరిహారాన్ని అందజేస్తాం. ప్రభావిత ప్రాంతాల్లో 24 గంటలూ వైద్యశిబిరాలు, యూపీహెచ్‌సీల వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం. ప్రతివీధికి ఒక వైద్యబృందం, శానిటేషన్, ఇంజనీరింగ్ ప్లానింగ్ బృందాలను కేటాయించి పారిశుద్ధ్య పనులు, పైపులైన్లు లీకేజీల తనిఖీలు వేగవంతం చేశాం. మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశాం. 9 మంది కీలక అధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అత్యవసర పరిస్థితుల కోసం దమ్మలవీధిలో నాలుగు అంబులెన్స్‌లు నిరంతరం అందుబాటులో ఉంచాం. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. ప్రతి సచివాలయం పరిధిలో పది ప్రత్యేక బృందాలతో ఇంటింటా సర్వే నిర్వహిస్తూ స్వల్ప లక్షణాలు ఉన్నవారికి తక్షణ చికిత్స అందిస్తున్నాం. మునిసిపల్ నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసి ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. సేకరించిన నీటి నమూనాలను ఇప్పటికే ల్యాబ్‌కు పంపగా, ఆ నివేదిక అందిన తర్వాత డయేరియా ప్రధాన కారణాలను శా స్ర్తీయంగా విశ్లేషిస్తాం’ అని తెలిపారు. సమావేశంలో జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, నగర పాలక సంస్థ కమిషనర్ కూర్మారావు తదితరులు పాల్గొన్నారు.
కంట్రోల్ రూమ్: 08942-229080
డయేరియా ప్రబలిన నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించడం, క్షేతస్థాయి పరిస్థితులను నిరంతరం సమీక్షించడం కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 08942-229080 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.