చవితిసీదిలో ప్రబలిన డయేరియా
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:02 AM
మండలంలోని చవితిసీది గ్రామంలో డయేరియా ప్రబలడంతో 20 మంది వరకూ మంచంపట్టారు. వ్యాధిబారిన పడి పలువురు మూడు రోజులుగా సారవకోట మండలంలోని బొంతు పీహెచ్‌సీలో చికిత్సపొందుతున్నారు. పలువురు చిన్నారులతో పాటు వృద్ధులు కూడా డయేరియా బారినపడ్డారు.
హిరమండలం, జనవరి18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చవితిసీది గ్రామంలో డయేరియా ప్రబలడంతో 20 మంది వరకూ మంచంపట్టారు. వ్యాధిబారిన పడి పలువురు మూడు రోజులుగా సారవకోట మండలంలోని బొంతు పీహెచ్‌సీలో చికిత్సపొందుతున్నారు. పలువురు చిన్నారులతో పాటు వృద్ధులు కూడా డయేరియా బారినపడ్డారు. ఆదివారం మరో నలుగురికి అంబులెన్స్‌లో బొంతు ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా నయం కాకపోవడంతో నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. మరికొంత మంది స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీల వద్ద చికిత్స చేయించుకుంటున్నారు. కాపు వీధిలో ఎక్కువ మంది బాధితులు ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు. సర్పంచ్‌కు సమాచారం ఇవ్వడంతో గ్రామంలో బ్లీచింగ్‌చేయడంతోపాటు కోరినేషన్ చేశారు. తక్షణమే వైద్యశిబిరం నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. కాగా చవితిసీదిలో ఏఎన్‌ఎంను పంపించి ఆదివారం ఇంటింటా సర్వే చేయించామని హిరమండలం పీహెచ్‌సీ వైద్యాధికారి సాయికుమార్ తెలిపారు. డయేరియా బాధితులను తమ పీహెచ్‌సీకి రావాలని కోరుతుంటే దగ్గరగా ఉన్న బొంతు పీహెచ్‌సీకి వెళ్తున్నారని చెప్పారు. గ్రామంలో సోమవారం వైద్యశిబిరం నిర్వహిస్తామని తెలిపారు.