Share News

‘ఈ-కోలి’తోనే డయేరియా

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:32 AM

Bacteria detected in 11 drinking water samples ‘శ్రీకాకుళంలోని పలు ప్రాంతాల్లో డయేరియా వ్యాప్తికి ‘ఈ-కోలి’ బ్యాక్టీరియా ప్రధాన కారణం. నగరంలో సేకరించిన 11 తాగునీటి నమూనాల్లో ప్రమాదకరమైన ‘ఈ-కోలి’ బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింద’ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ వీరపాండియన్‌ వెల్లడించారు.

‘ఈ-కోలి’తోనే డయేరియా
శ్రీకాకుళంలో డయేరియా ప్రభావిత ప్రాంత ప్రజలతో మాట్లాడుతున్న ఆరోగ్యశాఖ కమిషనర్‌ వీరపాండియన్‌, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • 11 తాగునీటి నమూనాల్లో బ్యాక్టీరియా గుర్తింపు

  • మొత్తం 158 కేసుల్లో 47 మంది డిశ్చార్జి

  • శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలి

  • ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వీరపాండియన్‌

  • శ్రీకాకుళం కలెక్టరేట్‌, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ‘శ్రీకాకుళంలోని పలు ప్రాంతాల్లో డయేరియా వ్యాప్తికి ‘ఈ-కోలి’ బ్యాక్టీరియా ప్రధాన కారణం. నగరంలో సేకరించిన 11 తాగునీటి నమూనాల్లో ప్రమాదకరమైన ‘ఈ-కోలి’ బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింద’ని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ వీరపాండియన్‌ వెల్లడించారు. శుక్రవారం కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌తో కలిసి శ్రీకాకుళంలో డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. సిమ్మన్న ఆసుపత్రి, బోడెమ్మ కోవెల, ఎచ్చెర్ల వీధి పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు, తాగునీటి పైపులైన్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఎచ్చెర్ల వీధిలో చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడారు. వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘శ్రీకాకుళంలో ఇప్పటివరకు 158 డయేరియా కేసులు నమోదు కాగా, 111 మంది చికిత్స పొందుతున్నారు. 47 మంది డిశ్చార్జి అయ్యారు. సేకరించిన నీటి నమూనాల్లో 11 చోట్ల ఈ-కోలి బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించాం. ప్రజలు కాలువల మీదుగా అక్రమంగా తాగునీటి కనెక్షన్లు తీసుకోవడం, వాటికి మోటార్లను బిగించి, నీటిని తీసుకోవడం వలన భూగర్భంలోని మురుగునీరు.. మంచినీటిలో కలుస్తోంది. రోడ్లపై పశువులను వదిలేయడం వల్ల వ్యర్థాలు కూడా నీటి కాలుష్యానికి కారణమవుతున్నాయి. భవిష్యత్‌లో ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల’ని అధికారులను ఆదేశించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌.. పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా గత పది రోజులుగా క్షేత్రస్థాయిలో అందిస్తున్న సేవలను వివరించారు. ప్రజలు అక్రమ తాగునీటి కనెక్షన్లు, మోటార్ల వాడకాన్ని నిలిపేయాలని విజ్ఞప్తి చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, ట్రైనీ కలెక్టర్‌ పృథ్వీరాజ్‌కుమార్‌, శ్రీకాకుళం, టెక్కలి ఆర్డీవోలు సాయి ప్రత్యూష, కృష్ణమూర్తి, డీఎంహెచ్‌వో డా.అనిత, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

  • నగర ఇన్‌చార్జి కమిషనర్‌గా రాము

  • శ్రీకాకుళం కార్పొరేషన్‌ ఇన్‌చార్జి కమి షనర్‌గా రాము నియమితులయ్యారు. నగరంలో డయేరియా వ్యాప్తికి అప్పటి కమిషనర్‌ కూర్మారావును బాధ్యుడిని చేస్తూ ప్రభుత్వం సస్పెన్షన్‌ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఇన్‌చార్జిగా గతంలో శ్రీకాకుళం కార్పొ రేషన్‌ కమిషనర్‌గా పనిచేసిన నల్లనయ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే నల్లనయ్య విధుల్లో చేరకముందే.. విశాఖపట్నం లోనే ఆయన అవసరం ఉందంటూ హడావుడిగా ఆ ఆదేశాలను నిలుపు దల చేశారు. ఆయన స్థానంలో ఇన్‌చార్జి కమిషనర్‌గా బొడ్డేపల్లి రామును నియ మించారు. ప్రస్తుతం జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ నగర ఇన్‌చార్జి కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు.

Updated Date - Feb 28 , 2026 | 12:32 AM