అదుపులోకి వచ్చిన డయేరియా
ABN , Publish Date - Jul 10 , 2026 | 11:53 PM
శాలిహుండాం లోని కస్తూర్బా పాఠశాలలో డయేరియా సోకిన పలువురు విద్యార్థినులు కోలుకుంటున్నారు. బుధ, గురువారాల్లో కడుపునొప్పి, విరేచనాలతో బాధపడిన విద్యార్థినులను శుక్రవారం గార పీ హెచ్‌సీ వైద్యాధికారి సోనియా పరీక్షించారు. పాఠశాలలో వైద్యశిబిరం నిర్వహించారు.
శ్యాంపిల్స్‌ను సేకరించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
గార, జూలై 10 (ఆంధ్రజ్యోతి): శాలిహుండాం లోని కస్తూర్బా పాఠశాలలో డయేరియా సోకిన పలువురు విద్యార్థినులు కోలుకుంటున్నారు. బుధ, గురువారాల్లో కడుపునొప్పి, విరేచనాలతో బాధపడిన విద్యార్థినులను శుక్రవారం గార పీ హెచ్‌సీ వైద్యాధికారి సోనియా పరీక్షించారు. పాఠశాలలో వైద్యశిబిరం నిర్వహించారు. డయేరియా సోకిన విద్యార్థినులతో పాటు ఇతర విద్యా ర్థినులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. కాలం చెల్లిన పల్లీ చెక్కీలు తినడం, శుభ్రత లేని రాగి పిండితో జావ తాగడంతో పాటు ఆదివారం పలువురు విద్యార్థినుల తల్లిదండ్రులు బయట నుంచి తెచ్చిన తినుబండారాలను తినడం వల్ల కూడా అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. డాక్టర్ సోనియా మాట్లాడుతూ.. అస్వస్థతకు గురైన విద్యార్థినులు పూర్తిగా కోలుకుంటున్నారని, శుక్ర వారం కొత్తగా కేసులు నమోదుకాలేదన్నారు. విద్యార్థినులకు అవసరమైన మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. పాఠశాలలో ఇచ్చిన శనగ పలుకుల చెక్కీలు, రాగిపిండి, గోధుమపిండి తదితర పదార్థాల శ్యాంపిల్స్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు తీసుకొని వెళ్లారు. పాఠశాలలో ఉన్న ఆర్వో ప్లాంట్ ద్వారా సరఫరా చేసే మంచినీటి శాంపిల్స్‌ను కూడా సంబంధిత అధికారులు తీసుకొని వెళ్లారు. విద్యార్థి నులను వైసీపీ నాయకుడు ధర్మాన రామ్ మనోహర్‌నాయుడు, ఎంపీపీ గొండు రఘురాం తదితరులు పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.