చదరంగం ఫిడే రేటింగ్ చాంపియన్‌గా ధ్రువేష్
ABN , Publish Date - May 18 , 2026 | 11:43 PM
నగరంలో ఐదు రోజులుగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చదరంగం పోటీల్లో చాంపియన్‌గా ధ్రువేష్ దొండపాటి నిలిచాడు.
శ్రీకాకుళం స్పోర్ట్స్, మే 18(ఆంధ్రజ్యోతి): నగరంలో ఐదు రోజులుగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చదరంగం పోటీల్లో చాంపియన్‌గా ధ్రువేష్ దొండపాటి నిలిచాడు. స్థానిక గ్రాండ్ కన్వెన్షన్‌లో జరిగిన పోటీల్లో 9 రౌండ్ల పాటు ఐదు రోజులు నిర్విరామంగా జరుగగా, 9 రౌండ్లకు గాను 8 పాయింట్లు సాధించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు ద్రువేష్ విజేతగా నిలిచాడు. ఏడున్నర పాయింట్లతో విజయవాడకు చెందిన కొల్లా భవన్ ద్వితీయ, తమిళనాడుకు చెందిన విజ్ఞేశ్వరన్ మూడ వ, ఒడిశా రాష్ర్టానికి చెందిన శ్రీహన్ సాబత్ నాల్గవ స్థానం సాధిం చారు. వీరితోపాటు వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. అమెరికా నుంచి వచ్చిన క్రీడాకారుడు 14వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. విజేతలకు ఎమ్మెల్యే గొండు శంకర్ బహుమతులు అందజేశారు. జ్ఞాపిక, ప్రశంసాపత్రం, నగదు పురస్కారం అందించారు. కార్యక్రమంలో జీఎంఆర్‌ఐటీ వీసీ జె.గిరీష్, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, టీడీపీ నాయకుడు చౌదరి బాబ్జీ, చెస్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ బొడ్డేపల్లి రమేష్, టోర్నమెంటు డైరెక్టర్ సనపల భీమారావు తదితరులు పాల్గొన్నారు.