భక్తులకు ఇబ్బందులు తలెత్తకూడదు
ABN , Publish Date - Feb 03 , 2026 | 11:22 PM
Shivaratri celebrations from 15th శ్రీముఖలింగంలో శివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఉత్సవ ఏర్పాట్లుపై సమీక్ష నిర్వహించారు.
శ్రీముఖలింగంలో 15 నుంచి శివరాత్రి ఉత్సవాలు
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష
శ్రీకాకుళం కలెక్టరేట్, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): శ్రీముఖలింగంలో శివరాత్రి ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఉత్సవ ఏర్పాట్లుపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ‘జలుమూరు మండలం శ్రీముఖలింగంలో ఈ నెల 15 నుంచి 18 వరకు శివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాట్లు చేయాలి. చివరిరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి చక్రతీర్థ స్నానాలు నిర్వహిస్తాం. పుణ్యస్నానాలు ఆచరించేందుకు వంశధార నదిలో తగినంత నీటినిల్వ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు. పారిశుధ్య నిర్వహణ చేపట్టాలి. అత్యవసర వైద్యసేవల కోసం 104, 108 వాహనాలను సిద్ధం చేయాలి. ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాల’ని తెలిపారు.
నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ చక్రతీర్థ స్నానాల రోజు రద్దీ ఎక్కువగా ఉంటుందని, భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరారు.
ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ‘భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నాం. ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలతో నిఘాతోపాటు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతామ’ని తెలిపారు. సమావేశంలో డీఆర్వో లక్ష్మణమూర్తి, దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ పట్నాయక్, ఆలయ ఈవో ఏడుకొండలు, డీపీవో భారతీ సౌజన్య, ఇన్‌చార్జి ఆర్డీవో జయదేవి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సత్యనారాయణ, డీఎంహెచ్‌వో డా.అనిత, జిల్లా అగ్నిమాపక అధికారి జె.మోహనరావు పాల్గొన్నారు.