Share News

పలాస ఎయిర్‌పోర్టుతో అభివృద్ధి

ABN , Publish Date - May 28 , 2026 | 01:01 AM

పలాసలో ఎయిర్‌పోర్టు నిర్మాణం జరిగితో జిల్లా అన్ని విధాలా అభివృద్ధి చెందనుందని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పేర్కొన్నా రు.

పలాస ఎయిర్‌పోర్టుతో అభివృద్ధి
మాట్లాడుతున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): పలాసలో ఎయిర్‌పోర్టు నిర్మాణం జరిగితో జిల్లా అన్ని విధాలా అభివృద్ధి చెందనుందని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పేర్కొన్నా రు. కలెక్టరేట్‌లో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌తో కలిసి బుధవారం నిర్వహించిన మీడియా స మావేశంలో ఆయన మాట్లాడారు. ఎయిర్‌ పోర్టు ఏర్పాటుతో దానికి అనుబంధంగా టూరి జం, పరిశ్రమలు, రవాణా మొదలైన అభివృద్ధి పనులు జోరందుకుంటాయని తెలిపారు. భవిష్యత్తులో శ్రీకాకుళం వలసల జిల్లా నుంచి ఉపాధి కల్పన కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఎయిర్‌పోర్టు కోసం 1348 మంది రైతుల నుంచి 1262 ఎకరాల భూసేకరణ చేపడతాం. రైతులకు ఇప్పటికే ఈ విషయాన్ని వీఆర్వోల ద్వారా తెలియజేశాం. గ్రామసభలు నిర్వహించి, రైతులతో నేరుగా మాట్లాడి అత్యంత పారదర్శకంగా భూసేకరణ చేపడతాం. ఈ భూసేకరణలో ఒక్క ఇల్లు కూడా ఎవరూ కోల్పోకుండా ప్రణాళిక వేశాం. జిల్లా తలసరి ఆదాయం రూ.1.5లక్షలు మాత్రమే ఉంది. కానీ ఈ ప్రాజెక్టుతో ఖచ్చితంగా జిల్లా ప్రజల తలసరి ఆదాయం పెరగనుంది. ఎయిర్‌పోర్టును మూలపేట పోర్టుతో అనుసంధానం చేయడం ద్వారా ఉత్తరాంధ్రలోనే గొప్ప అభివృద్ధి జరుగనుంది. జిల్లాలో వ్యవసాయధారిత పరిశ్రమల స్థాపన, ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు, అలాగే టూరిజం రంగాలను అభివృద్ధి చేయడం ద్వారా కార్గో విమాన సర్వీసుల ద్వారా ఎగుమతులు జరిగి, జిల్లా అభివృద్ధి పథంలో నడుస్తుంది. అలాగే యువతకు ఉపాధి కల్పన జరుగుతుంది. టూరిజం అభివృద్ధికి జిల్లాలో నాలుగు చోట్ల భూసేకరణ చేస్తాం. పెట్టుబడిదారులు వస్తే అన్ని విధాలా సహకరిస్తాం. ప్రజలు సర్వే సిబ్బందికి సహకరించాలి. ఎటువంటి అనుమానాలు, అపోహలు వద్దు. పూర్తిస్థాయి న్యాయం జరుగుతుంది. జిల్లా అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి’ అని కలెక్టర్‌ పిలుపునిచ్చారు.

Updated Date - May 28 , 2026 | 01:01 AM