పరిశ్రమలతోనే అభివృద్ధి
ABN , Publish Date - May 25 , 2026 | 11:57 PM
Foundation stone laid for three MSME parks ‘పారిశ్రామిక ప్రగతికి ఎంఎస్‌ఎంఈ పార్కులు విప్లవాత్మక సోపానాలుగా నిలుస్తాయి. జిల్లా మరింత అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికీకరణే ఏకైక మార్గం. పరిశ్రమలు వస్తేనే.. జిల్లా రూపురేఖలు మారుతాయి. ఇందుకోసం ప్రజలు, యువత పూర్తి సహకారం అందించాల’ని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
జిల్లాలో మూడు ఎంఎస్‌ఎంఈ పార్కులకు వర్చువల్‌గా సీఎం శంకుస్థాపన
వైసీపీ హయాంలో పారిశ్రామిక వేత్తలకు వేధింపులు
కూటమి పాలనలో ప్రోత్సాహకాలు
మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళి/ జలుమూరు/ కవిటి, మే 25(ఆంధ్రజ్యోతి): ‘పారిశ్రామిక ప్రగతికి ఎంఎస్‌ఎంఈ పార్కులు విప్లవాత్మక సోపానాలుగా నిలుస్తాయి. జిల్లా మరింత అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికీకరణే ఏకైక మార్గం. పరిశ్రమలు వస్తేనే.. జిల్లా రూపురేఖలు మారుతాయి. ఇందుకోసం ప్రజలు, యువత పూర్తి సహకారం అందించాల’ని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్ట్రవ్యాప్తంగా 38 ఇండస్ర్టియల్ పార్కులకు వర్చువల్ విధానంలో శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా సోమవారం జిల్లాకు సంబంధించి మూడు పార్కుల శంకుస్థాపనను వర్చువల్‌గా ప్రారంభించారు. కోటబొమ్మాళి మండలం చీపుర్లపాడు పంచాయతీ పరిధి ఊడికలపాడు సమీపంలో రూ.10.51 కోట్ల వ్యయంతో 12.22 ఎకరాల విస్తీర్ణంలో 74 ప్లాట్లతో నూతనంగా అభివృద్ది చేయనున్న ఎంఎస్‌ఎంఈ పార్కుకు కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్‌తో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి ఇంటికీ ఒక పారిశ్రామికవేత్తను తయారుచేయడమే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ప్రధాన లక్ష్యం. వలసలు నివారించి.. జిల్లాలో యువతకు, మహిళా సంఘాలకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే ఎంఎస్‌ఎంఈ పార్కుల ముఖ్య ఉద్దేశం. స్థానిక ఉత్పత్తుల విక్రయాలకు ఇవి అద్భుత వేదికగా మారనున్నాయి. రైతన్నలు పెద్ద మనసు చేసుకుని పరిశ్రమల స్థాపనకు భూములను అందిస్తే.. జిల్లాకు భారీ పెట్టుబడులు వస్తాయి. తద్వారా యువతకు స్థానికంగానే లక్షలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయ’ని తెలిపారు. టెక్కలి నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం రూ.620 కోట్లు మంజూరు చేసిందన్నారు. 2029 నాటికి ఆ ప్రాజెక్టుతోపాటు నేరడి బ్యారేజీ కూడా పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో ఎన్.కృష్ణమూర్తి, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, రాష్ట్ర కళింగకోమటి కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు, జిల్లా రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షుడు బోయిన రమేష్, టీడీపీ మండల అధ్యక్షుడు బోయిన సత్యశ్రీనివాస్, పీఏసీఎస్ అధ్యక్షురాలు వెలమల విజయలక్ష్మి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం : ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి
డ్వాక్రా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. సోమవారం జలుమూరు మండలం ఏనేటి కొత్తూరు సమీపంలో 9 ఎకరాల్లో ఎంఎస్‌ఎంఈ ఇండ్రస్ట్రియల్ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే రమణమూర్తి మాట్లాడుతూ.. ‘పారిశ్రామికాభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేసి.. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు మహిళలకు ప్రోత్సాహకాలతో పాటు క్లస్టర్ డెవలప్‌మెంటు ప్రోగ్రాం చేపడుతున్నారు’ని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో పాటు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బగ్గు అర్చన, కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోణంకి కృష్ణంనాయుడు, టీడీపీ మండల అధ్యక్షుడు వెలమల రాజేంద్రనాయుడు, తహసీల్దారు జె.రామారావు తదితరులు పాల్గొన్నారు.
పారిశ్రామికీకరణతో ఉపాధి : ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అశోక్
పారిశ్రామికీకరణ దిశగా అభివృద్ధి చేసి.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. సోమవారం కవిటి మండలం శిలగాం పంచాయతీ అల్లేరులో కోకోనట్ పార్కు(ఎంఎస్‌ఎంఇ)కు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘నియోజకవర్గంలో కొబ్బరి రైతులకు మేలు చేకూర్చే విధంగా కోకోనట్ పార్కు ఏర్పాటు కానుంది. కొబ్బరి ఆధారిత పరిశ్రమల వలన.. ఎంతోమందికి ఉపాధి దక్కనుంది. కొబ్బరికి మంచి ధర రానుంది. వలసల నివారణలో భాగంగా ఏపీఐఐసీ ద్వారా ఉద్యానశాఖకు చెందిన భూమిని సేకరించి.. పరిశ్రమ నెలకొల్పేందుకు శ్రీకారం చుట్టామ’ని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్.రామారావు, పలాస ఆర్డీవో అప్పలరాజు, ఏఎంసీ చైర్మన్ మణిచంద్రప్రకాష్, పీఏసీఎస్ చైర్మన్ బాసుదేవ్‌ప్రదాన్, మండల టీడీపీ అధ్యక్షుడు పి.కృష్ణారావు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌వీ రమణ, డైరెక్టర్ బి.చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు.