Share News

కేంద్ర సహకారంతోనే అభివృద్ధి

ABN , Publish Date - Oct 02 , 2026 | 12:12 AM

The goal is the eradication of poverty రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందులో ఉన్నా.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామ’ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం గంగుపేట, దుప్పిలపాడు గ్రామాల్లో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుడ్కర్‌తో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

కేంద్ర సహకారంతోనే అభివృద్ధి
పింఛన్‌ పంపిణీ చేస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌

పేదరిక నిర్మూలనే ధ్యేయం

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందులో ఉన్నా.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామ’ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం గంగుపేట, దుప్పిలపాడు గ్రామాల్లో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుడ్కర్‌తో కలిసి ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దుప్పిలపాడులో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ ‘పేదరికాన్ని నిర్మూలనతోపాటు ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడమే ప్రభుత్వ ధ్యేయం. గ్రామాల్లో ఆర్థికంగా స్థిరపడిన వారు ప్రజాసేవలో భాగస్వాములు కావాలి. పేద కుటుంబాలను దత్తత తీసుకుని అండగా నిలవాల’ని పిలుపునిచ్చారు. ‘గత ప్రభుత్వ హయాంలో కేంద్రం పేదల ఇళ్ల నిర్మాణానికి రూ.1900 కోట్లు మంజూరు చేసింది. గొడ్డలిపార్టీ అధ్యక్షుడు ఆ నిధులను పక్కదారి పట్టించారు. పేదలకు ఇళ్లు లేకుండా చేశార’ని మంత్రి అచ్చెన్న ఆరోపించారు. త్వరలో మూడు లక్షల ఇళ్లకు సంబంధించి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ చేతుల మీదుగా మంజూరు పత్రాలు అందజేయనున్నామని తెలిపారు.

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ.. ‘దుప్పిలపాడు గ్రామం చూస్తే ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఇంటి ముందు ఆవులను చూస్తే పూర్వపు రోజులు గుర్తుకొచ్చాయి. ఈ గ్రామానికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామ’ని తెలిపారు.

అర్హులకు ప్రతీ పథకం చేరాలి

ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ పథకం.. అర్హులైన లబ్ధిదారులకు చేరాలని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గురువారం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జేసీ ఫర్మాన్‌అహ్మద్‌ఖాన్‌, అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా సమగ్రాభివృద్ధి, సంక్షేమ ఫథకాలు అమలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కొత్త పింఛన్లు, ఇళ్ల మంజూరు ప్రక్రియ పారదర్శకంగా చేపట్టేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో ఎన్‌.కృష్ణమూర్తి, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరిప్రసాద్‌, టీడీపీ నేతలు బోయిన గోవిందరావు, బోయిన రమేష్‌, వెలమల విజయలక్ష్మి, కామేశ్వరరావు, కర్రి అప్పారావు, ఎండ నర్సింహామూర్తి, తహసీల్దార్‌ సీహెచ్‌ ప్రసాదరావు, ఎంపీడీవో కిల్లారి నారాయణరావు పాల్గొన్నారు.

Updated Date - Oct 02 , 2026 | 12:12 AM