Share News

అభివృద్ధి ‘బాట’

ABN , Publish Date - Apr 12 , 2026 | 11:10 PM

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గోతులు, రాళ్లతో అధ్వానంగా ఉన్న రోడ్లు ప్రస్తుతం అద్దంలా మారుతున్నాయి.

అభివృద్ధి ‘బాట’
ఆర్‌అండ్‌బీ పరిధిలో జరిగిన ఎన్‌హెచ్‌16 నుంచి చాకిపల్లి రోడ్డు.

- అద్దంలా మారుతున్న రహదారులు

- పల్లెలు, పట్టణాల్లో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం

టెక్కలి, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గోతులు, రాళ్లతో అధ్వానంగా ఉన్న రోడ్లు ప్రస్తుతం అద్దంలా మారుతున్నాయి. గోతులు లేని రోడ్లే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనులు చేపడుతోంది. పల్లెలు, పట్టణాలు అనే తేడాలేకుండా పనులను పరుగులు పెట్టిస్తోంది. పంచాయతీరాజ్‌శాఖ ద్వారా టెక్కలి, నందిగాం మండలాల్లో రూ.130కోట్లతో సీసీ, బీటీ రోడ్లు పనులు జరుగుతుండగా, ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా రూ.30కోట్లతో తారు రోడ్లను వేయిస్తున్నారు. ఏ గ్రామంలోకి వెళ్లినా సీసీ రోడ్లు, గ్రామం దాటితే బీటీ రోడ్లు ఉండాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు ప్రణాళికలు రూపొందించి పక్కా రహదారులను నిర్మిస్తున్నారు. ఆర్‌అండ్‌బీ పరిధిలోని జాతీయ రహదారి నుంచి చాకిపల్లికొత్తూరు, టెక్కలిలో పాతజాతీయ రహదారి, అలాగే చెట్లతాండ్ర-డీజీపురం, మణిగాం, టీటీ రోడ్డు-మర్రిపాడు, నౌపడ-డమర, నర్సిపురం జంక్షన్‌-మర్రిపాడు ఇలా అనేక రోడ్లు బీటీ రోడ్లుగా కార్యరూపం దాల్చాయి. పంచాయతీరాజ్‌ పరిధిలో జాతీయ రహదారి నుంచి పోతలూరు, ఎన్‌ఎం రోడ్డు నుంచి రావివలస-సంతబొమ్మాళి, పోలవరం నుంచి వయా పెద్దసాన, పరశురాంపురం, టీటీ రోడ్డు నుంచి గంగాధరపేట, బన్నువాడ నుంచి రోకల్లపల్లి, ఎన్‌ఎం రోడ్డు నుంచి రాంపురం, కొండపేట, మజ్జివాడ, పాతటెక్కలి నుంచి వల్లభరాయుడుపాడు, జాతీయరహదారి నుంచి కొత్తగ్రహారం ఇలా అనేక చోట్ల తారు రోడ్లు వేశారు. అయ్యప్పనగర్‌, ఎన్టీఆర్‌ కాలనీ, శ్రీనివాసనగర్‌, వెంకటేశ్వర కాలనీ, గోపినాథపురం ఇలా పలు ప్రాంతాల్లో కూడా సీసీ రోడ్లు వేశారు. రోడ్ల పనుల వెనుక మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కృషి ఉందని పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ డీఈఈలు పి.సుధాకర్‌, రవికాంత్‌ తెలిపారు. అన్ని గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి చొరవచూపుతామని అన్నారు.

Updated Date - Apr 12 , 2026 | 11:10 PM