టీడీపీతోనే అభివృద్ధి సాధ్యం
ABN , Publish Date - May 11 , 2026 | 12:22 AM
Drinking water supply with Rs. 1.80 crores కోటబొమ్మాళి పంచాయతీని దివంగత నేత ఎర్రన్నాయుడు నుంచి ఇప్పటివరకు అభివృద్ది చేసింది టీడీపీ ప్రభుత్వమేనని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు.
రూ.1.80కోట్లతో తాగునీటి సరఫరాకు చర్యలు
మంత్రి అచ్చెన్నాయుడు
కోటబొమ్మాళిలో ప్రజలతో మాటామంతీ
కోటబొమ్మాళి, మే 10(ఆంధ్రజ్యోతి): కోటబొమ్మాళి పంచాయతీని దివంగత నేత ఎర్రన్నాయుడు నుంచి ఇప్పటివరకు అభివృద్ది చేసింది టీడీపీ ప్రభుత్వమేనని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం స్థానిక శివాలయం వద్ద 1,2,3,5 వార్డుల ప్రజలతో ఆయన మాటామంతీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల ప్రజలు తమ సమస్యలను మంత్రికి వివరించారు. సీసీరోడ్లు, కాలువలు, సామాజిక భవనాలు నిర్మించాలని, తాగునీటి వసతి కల్పించాలని, చెరువులకు మరమ్మతులు చేపట్టాలని, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, యువతకు ఉద్యోగాలు కల్పించాలని పలువురు విజ్ఞప్తి చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘కూటమి అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో కోటబొమ్మాళి పంచాయతీ అభివృద్ధికి రూ.7కోట్లు ఖర్చు చేశాం. మరో ఆరు నెలల్లో పంచాయతీల్లోని ప్రతి సమస్యా పరిష్కరిస్తాం. రూ.1.80 కోట్లతో 1,2,3,5 వార్డులకు తాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. శివాలయం అభివృద్ధికి కృషి చేస్తా. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు.. మంత్రి నారా లోకేశ్ చొరవతో రూ.22కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు వచ్చాయి. రూ. 10లక్షల కోట్లుతో ఇప్పటికే నిర్మాణాలు జరుగుతున్నాయి. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు రైతులు భూములు ఇచ్చి సహకరించాలి. పోర్టు నిర్మాణం వల్ల ఉద్యోగాలు రావు. అనుబంధ పరిశ్రమలు వస్తే వందలాదిమందికి నిరుద్యోగ సమస్య తీరుతుంద’ని తెలిపారు. అంతకుముందు తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయంలో రూ.53లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్, జిల్లా రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షుడు బోయిన రమేష్, ఏఎంసీ చైర్మన్ బగాది శేషు, ఆర్డీవో ఎన్.కృష్ణమూర్తి, తహసీల్దార్ ప్రసాదరావు, ఎంపీడీవో ఫణీంద్రకుమార్, టీడీపీ నేతలు కల్లి నాగయ్యరెడ్డి, లక్ష్మణరెడ్డి, శివారెడ్డి, తర్రరామక్రిష్ణ, కమ్మకట్టు శ్రీనివాస్‌రెడ్డి, కర్రి అప్పారావు, నంబాళ శ్రీనివాస్ పాల్గొన్నారు.