అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యం
ABN , Publish Date - Jul 07 , 2026 | 12:29 AM
Job and employment opportunities ప్రజలకు అభివృద్ధి, సంక్షేమంతోపాటు ఉపాధిని చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందిస్తాం
కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
పాతపట్నం/ రూరల్, జూలై 6(ఆంధ్రజ్యోతి): ప్రజలకు అభివృద్ధి, సంక్షేమంతోపాటు ఉపాధిని చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. సోమవారం పాతపట్నం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. స్థానిక ఆలాంధ్రరోడ్ కూడలి నుంచి మెళియాపుట్టి వరకూ రూ.3.40 కోట్లతో బీటీ రోడ్డు నిర్మించారు. కేజీబీవీలో రూ.2.55 కోట్లతో అదనపు వసతిగదుల ఏర్పాటు చేశారు. పాతపట్నంలో రూ.2.30కోట్లతో పీఎం జన్‌మన్ వసతిగృహాన్ని నిర్మించారు. పెద్దసీది జడ్పీ ఉన్నత పాఠశాలకు రూ.36లక్షలతో ప్రహరీ ఏర్పాటు చేశారు. వీటిని కేంద్రమంత్రి ప్రారంభించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ‘గత ప్రభుత్వ పాలనా వైఫల్యాల కారణంగా పెట్టుబడిదారులంతా తిలోదకాలు పలికారు. అభివృద్ధి దిశగా ప్రస్తుత కూటమి పాలన సాగుతోంది. డిసెంబరులో మూలపేట పోర్టు ప్రారంభించనున్నాం. పోర్టు నుంచి ఒడిశా, చత్తీస్‌ఘడ్ ప్రాంతాలకు ఆరులేన్ల హైవే నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపాం. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామ’ని కేంద్రమంత్రి తెలిపారు. విద్యాపరంగానూ మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. విద్యార్థుల్లో పఠనాసక్తి మరింత పెరగాలని సూచించారు. ‘రుగడ ఎత్తిపోతల పథకానికి పూర్వవైభవం తీసుకువస్తాం. కమలమ్మకొట్టు కూడలి నుంచి మాతల వరకూ బీటీ రోడ్డు విస్తరణ పనులు చేయిస్తాం. సీదిలో జిల్లాస్థాయి ఇండోర్ స్టేడియం, గ్రంథాలయం ఏర్పాటు చేస్తాం. జల్‌జీవన్ పథకంలో భాగంగా రూ.256 కోట్లతో నియోజకవర్గంలో ఇంటింటికీ కుళాయిల ఏర్పాటు పనులు వేగవంతం చేస్తామం. కరకట్టల నిర్మాణాలు చేపడతామ’ని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, టెక్కలి ఆర్డీవో ఎం.కృష్ణమూర్తి, ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు, కూటమి శ్రేణులు, అధికారులు పాల్గొన్నారు.