జిల్లాకు వాయుగుండం ముప్పు
ABN , Publish Date - Sep 20 , 2026 | 12:38 AM
Heavy rains on the 22nd and 23rd ‘తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే నాలుగు రోజులు ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా ఉండాల’ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు.
ఈనెల 22, 23 తేదీల్లో భారీ వర్షాలు
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం, సెప్టెంబర్ 19(ఆంధ్రజ్యోతి): ‘తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే నాలుగు రోజులు ప్రతి ఒక్కరూ అత్యంత అప్రమత్తంగా ఉండాల’ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. శనివారం శ్రీకాకుళంలోని విలేకరులతో కలెక్టర్ మాట్లాడుతూ.. ‘బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఈ నెల 23, 24 తేదీల్లో తుఫాన్‌గా జిల్లాపై ప్రభావం చూపే అవకాశముంది. ఈ ప్రభావంతో ఈ నెల 21 నుంచి జిల్లావ్యాప్తంగా వర్షాలు ప్రారంభమై, 22, 23 తేదీలలో అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయి. తీరం వెట గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు ఈనెల 25 వరకు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదు. కలెక్టరేట్‌లో విపత్తు నిర్వహణ కోసం కంట్రోల్‌రూమ్ 08942 240557 అందుబాటులోకి తెచ్చాం. 11 తీర ప్రాంత మండలాలకు సీనియర్ అధికారులను ఇన్‌చార్జిలుగా నియమించాం. జిల్లాలోని అధికారులందరికీ సెలవులు రద్దు చేశాం. సోమవారం నుంచి రాత్రివేళ విధులు కూడా అమలు చేస్తాం. ప్రభుత్వం అనుమతించిన ప్రదేశాల్లోనే వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తి చేయాలి. నదీ పరివాహక ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉండాలి. రాబోయే నాలుగు రోజుల పాటు ఇసుక రీచ్‌లలో తవ్వకాలను పూర్తిగా నిలిపివేస్తున్నాం. తుఫాన్ పునరావాస కేంద్రాల్లో మంచినీరు, బియ్యం, ప్రాథమిక వసతులు కల్పిస్తాం. ప్రజలు అత్యవసరమైతేనే తప్ప బయటకు రాకూడద’ని తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ మహేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.