ఓటుతోనే ప్రజాస్వామ్యం
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:22 AM
Today is National Voters' Day ఓటు చరిత్రను మారుస్తుంది. భవితకు బాటలు వేస్తుంది. నా ఒక్క ఓటే ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యం వద్దు.. నీ ఓటే ప్రజాస్వామ్యానికి బలం. 18 ఏళ్లు నిండిన అర్హులంతా ఓటుహక్కు వినియోగించుకుంటేనే ప్రజాస్వామ్యం మరింత ధృడపడుతుంది.
నాటి రాజకీయాలు కనుమరుగు
ప్రస్తుతం అంతా బెదిరింపులు, ప్రలోభాలు
ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలి
నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం
టెక్కలి రూరల్/ నరసన్నపేట/ జనవరి 24(ఆంధ్రజ్యోతి): ఓటు చరిత్రను మారుస్తుంది. భవితకు బాటలు వేస్తుంది. నా ఒక్క ఓటే ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యం వద్దు.. నీ ఓటే ప్రజాస్వామ్యానికి బలం. 18 ఏళ్లు నిండిన అర్హులంతా ఓటుహక్కు వినియోగించుకుంటేనే ప్రజాస్వామ్యం మరింత ధృడపడుతుంది. ఆ దిశగా ప్రజలను చైతన్యపరచడమే ఎన్నికల సంఘం ముఖ్య ఉద్దేశం. ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
జిల్లాలో మహిళ ఓటర్లు అధికం:
జిల్లాలో మొత్తం ఓటర్లు 18,92,149 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 9,37,191 మంది కాగా, మహిళలు 9,54,848 మంది ఉన్నారు. ట్రాన్స్‌జెండర్ మరో 110 మంది ఉన్నారు. కొత్తగా 18ఏళ్లు నిండినవారు 37,586 మంది ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 29,795 మందిని కొత్త ఓటర్ల జాబితాలో చేర్చినట్టు అధికారులు తెలిపారు. గతంలో అధికంగా పట్టణ ప్రాంతవాసులు ఓటుహక్కును వినియోగించుకునేవారు కాదు. దీంతో దొంగ ఓట్లకు అవకాశం ఉండేది. ఈ నేపథ్యంలో ఓటుహక్కు వినియోగంపై అధికారులు చైతన్యం పెంచారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించడంతో క్రమేపీ ఓటుహక్కు వినియోగం పెరిగింది. విలువలు, వ్యక్తిత్వం ప్రాతిపాదికగానే 1990వ దశకం వరకు ఎన్నికల్లో ఓటర్లు ఓట్లు వేసేవారు. కాగా నేడు చాలామంది ఓటర్లు ప్రలోభాలకు గురవుతున్నారు. దీంతో ప్రజాస్వామ్యం అపహాస్యంగా మారిందని వృద్ధులు, రాజనీతివేత్తలు చెబుతున్నారు. ఓటర్లు, నాయకుల్లో నాటి విలువలు కనుమరుగయ్యాయని పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో కులం, మతం, భాష, ధన ప్రభావాలతో ఓటు విలువ దిగజారిందని అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఓటుహక్కు వినియోగించుకోవాలని.. సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని సూచిస్తున్నారు.
ప్రస్తుతం ఓటరుగా నమోదు చాలా సులభం. ఎన్నికల సంఘం అనేక మాధ్యమాలను జనం ముందుంచింది. పోలింగ్ బూత్‌లతో ప్రత్యేక శిబిరాలను కూడా నిర్వహిస్తుంది. ఈఏడాది ఓటర్ల జాబితా సవరణకు శ్రీకారం చుట్టింది. అర్హుడైన ప్రతీ పౌరునికి ఓటుహక్కు కల్పించే లక్ష్యంగా ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
డబుల్ ఎంట్రీలు, ఒకే వ్యక్తికి రెండేసి. మూడేసి నియోజవర్గాల్లో ఓటుహక్కు కలిగి ఉన్నారు. అలాంటి వాటిని ఏరివేసేందుకు ఎన్నికల సంఘం దృష్టి సారించింది. రానున్న మూడేళ్లలో ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయనుంది.
నాడు అభ్యర్థికి చందాలు ఇచ్చేవాళ్లం
నా వయస్సు 85 ఏళ్లు దాటింది. నేను ఇప్పటివరకు 13 సార్లు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేశాను. అప్పట్లో ఎన్నికలు వస్తే.. ఇంటింటికీ చందాలు వేసుకుని పోటీ చేసిన అభ్యర్థికి డబ్బులు ఇచ్చేవాళ్లం. ప్రస్తుతం పరిస్థితి మారింది. అభ్యర్థుల నుంచే ఓటర్లు డబ్బులు తీసుకుంటున్నారు. అప్పుడు నిజాయితీగా ఓటు వేసేవాళ్లు. ఇప్పుడా పరిస్థితి లేదు.
గోకర్ల లక్ష్మీ, పాలవలస, టెక్కలి
ఎన్టీఆర్ వచ్చిన తర్వాతే..
నా వయసు 80 ఏళ్లు. గతంలో ఎన్నికలు ఎప్పుడు అయ్యావో తెలిసేది కాదు. గ్రామస్థుల తీర్మానం మేరకు అభ్యర్థికి ఓటు వేసేవాళ్లం. అంతగా చైతన్యం లేదు. నాడు ఓటువేసిన వారికి ఉప్మా ఇచ్చేవారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే ఓటర్లలో చైతన్యం పెరిగింది. మార్పు వచ్చింది.
అక్కమ్మ, బంజీరు, మెళియాపుట్టి
గ్రామ పెద్ద చెప్పిన విధంగానే..
నేను ఇప్పటివరకు పది ఎన్నికల్లో ఓటు వేశాను. అప్పట్లో ఆవుదూడ, హస్తం గుర్తులు ఉండేవి. తర్వాత రంగులరాట్నం గుర్తు వచ్చింది. నరసన్నపేట నడిచి వెళ్లి ఓటు వేసేవాళ్లం. గ్రామపెద్ద చెప్పిన అభ్యర్థినే గెలుపించుకునేవాళ్లం. అప్పటి నాయకులు ఊరి అభివృద్ధి కోసం పాటుపడేవారు. ఇప్పుడు ఎన్నికలంటే అంతా గొడవలే.
వెలమల నీలమ్మ, జమ్ము, శతాధికవృద్ధురాలు
ధన రాజకీయాలయ్యాయి
గత మూడు దశాబ్దాలుగా రాజకీయాలు, ఓట్లు ధనం చుట్టూ కేంద్రీకృతమయ్యాయి. 1960లో మొదటిసారిగా ఓటువేశాను. యువకుడిగా దేశానికి మంచి నాయకత్వం కావాలనే తలంపుతో అనాడు మంచి నాయకులకు బ్యాలెట్ ద్వారా ఓట్లు వేశాను. అప్పట్లో అభ్యర్థులు మాలాంటి చదువునే వ్యక్తులకు ఓటు కోసం ఉత్తరాలు కూడా రాసేవారు. ప్రత్యక్షంగా ఓటు అడగడం చాలా తక్కువ. చదువుకునే ఓటర్లు పెరిగారు. ఓటుహక్కును అమ్ముకునేవారు కూడా పెరగడం దురదృష్టం.
- కేవీఎస్ సత్యనారాయణ, రిటైర్డు డిగ్రీకళాశాల అధ్యాపకులు, నరసన్నపేట
ఎక్కువగా రిగ్గింగ్ జరిగేది
నా వయసు 91 ఏళ్లు. ఇప్పటివరకూ 15 సార్ల సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నాను. అప్పట్లో ముగ్గురు అభ్యర్థులు ఉంటే మూడు పెట్టెలు పెట్టేవారు. అవి కూడా అభద్రతగా ఉండేవి. బ్యాలెట్ పత్రాలపై ఒకే రంగు వేసేవాళ్లం. ఎవరికి ఓటు వేస్తామో వారి పెట్టెలో పత్రాలు వేయాలి. దీనివల్ల రిగ్గింగ్ ఎక్కువగా జరిగేది. ప్రజలు కూడా ఓటు వేయడానికి ముందుకు వచ్చేవారు కాదు. అసలు ఓటు అంటే కూడా తెలిసేది కాదు. తరువాత గుర్తులపై ఓటు వేసే విధానం వచ్చింది. ప్రస్తుతం ఈవీఎంల ద్వారా ఓటు వినియోగిస్తున్నాం. ప్రస్తుత ఓటింగ్ విధానమే మంచిది. అప్పట్లో ఎన్నికలంటే అంత హంగామా లేదు. గ్రామపెద్ద ఎవరికి చెబితే వారికే ఓటు అన్న విధంగా ఉండేది. రోజులు, పరిస్థితులు మారాయి. రానున్న కాలంలో ఇంకా మంచి పద్ధతిలో ఓటు విధానం రావచ్చు.
- దాశరధి, రిటైర్డ్ ఉపాధ్యాయుడు, గాంధీనగర్, కాశీబుగ్గ
ఓటు అమ్ముకోరాదు
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. కానీ ఆ ఓటును చాలామంది సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. నా వయసు 90 ఏళ్లు. 14 సార్లు సార్వత్రిక ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎన్నడూ ఓటును అమ్ముకోలేదు. ప్రలోభాలకు గురికాలేదు. నా ఇష్టమైన నాయకురాలు ఇందిరాగాంధీ. ఎన్నికల రోజు ఇప్పటీకి నేను కాలినడకనే ఓటు వేయటానికి వెళ్తుంటాను. ఓటును ఎప్పటీకీ అమ్ముకోరాదు. ఓటుహక్కు సద్వినియోగం చేసుకోవాలి.
- బలివాడ పద్మావతి, ఇచ్ఛాపురం