సకాలంలో న్యాయం అందించండి
ABN , Publish Date - Jul 16 , 2026 | 12:35 AM
పౌరులకు సకాలంలో న్యాయం అందించడంలో ఇటు ప్రభుత్వ అధికారులకు అటు న్యాయాధికారులకు ఎంతో బాధ్యత ఉందని జిల్లా ప్రధాన న్యాయాధికారి జునైద్ అహమ్మద్ మౌలానా అన్నారు.
- జిల్లా ప్రధాన న్యాయాధికారి జునైద్ అహమ్మద్ మౌలానా
శ్రీకాకుళం లీగల్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): పౌరులకు సకాలంలో న్యాయం అందించడంలో ఇటు ప్రభుత్వ అధికారులకు అటు న్యాయాధికారులకు ఎంతో బాధ్యత ఉందని జిల్లా ప్రధాన న్యాయాధికారి జునైద్ అహమ్మద్ మౌలానా అన్నారు. బుధవారం స్థానిక జిల్లా కోర్టు సమావేశ మందిరంలో అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ సమావేశం నిర్వహించారు. విచారణ దశలో ఉన్న కేసుల పురోగతిని ఆయన సమీక్షించి మాట్లాడారు. రెండు సంవత్సరాలకు పైగా పెండింగ్ ఉన్న అండర్ ట్రయల్ కేసులను ప్రాధాన్యతా క్రమంలో న్యాయాధికారులు విచారణ నిర్వహించాలని సూచించారు. ఖైదీలకు న్యాయసేవాధికార సంస్థ ద్వారా న్యాయవాదులను నియమించి ఉచిత న్యాయసహాయం అందించాలని ఆదేశించారు. చిన్నచిన్న నేరాలకు ఎక్కువ కాలం జైలులో ఉన్న సందర్భంలో బైయిల్ దరఖాస్తులను సానుభూతితో పరిశీలించాలన్నారు. సాక్షులు సకాలంలో కోర్టుకు హాజరయ్యే విధంగా పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఒకటవ అదనపు జిల్లా న్యాయాధికారి వై.బెన్నయ్య నాయుడు, 2వ అదనపు జిల్లా న్యాయాధికారి బి.సాధుబాబు, 3వ అదనపు జిల్లా న్యాయాధికారి సీహెచ్ వివేకానంద శ్రీనివాస్, సీనియర్ సివిల్ న్యాయాధికారి ఆర్.శాంతిశ్రీ. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు, ఏఎస్పీ పి.శ్రీనివాసరావు, డీఆర్వో విశ్వేశరరావు, జైలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.