నాలుగు మండలాల్లో లోటు
ABN , Publish Date - May 21 , 2026 | 12:20 AM
Deficit rainfall in the srikakulam జిల్లాలో నాలుగు మండలాల్లో రైతులను లోటు వర్షపాతం వెంటాడుతోంది. వర్షపాతానికి సంబంధించిన తాజా గణాంకాలను ప్రభుత్వం.. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే.. గతేడాది జూన్ 1 నుంచి ఈ నెల 19 వరకు జిల్లావ్యాప్తంగా సగటున ‘సాధారణ’ వర్షపాతమే నమోదైనప్పటికీ, మండలాల వారీగా మాత్రం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
జిల్లా వర్షపాతం గణాంకాలు వెల్లడి
సగటు సాధారణమే అయినా.. కొన్నిచోట్ల ప్రతికూలం
ఈ నెల ముఖం చాటేసిన వరుణుడు
రైతుల్లో తప్పని ఆందోళన
శ్రీకాకుళం, మే 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నాలుగు మండలాల్లో రైతులను లోటు వర్షపాతం వెంటాడుతోంది. వర్షపాతానికి సంబంధించిన తాజా గణాంకాలను ప్రభుత్వం.. అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ గణాంకాలను పరిశీలిస్తే.. గతేడాది జూన్ 1 నుంచి ఈ నెల 19 వరకు జిల్లావ్యాప్తంగా సగటున ‘సాధారణ’ వర్షపాతమే నమోదైనప్పటికీ, మండలాల వారీగా మాత్రం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లాలోని మెజారిటీ ప్రాంతాల్లో వాతావరణం సాగుకు అనుకూలంగా ఉండగా, కొన్ని ప్రాంతాల్లో కుంభవృష్టి, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.
జిల్లావ్యాప్తంగా ఈ వ్యవధిలో 1142.6 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 1134.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే కేవలం -0.73 శాతం మాత్రమే తక్కువ. ఇది భూగర్భ జలాల పెంపునకు, తాగునీటి ఎద్దడి నివారణకు సానుకూలంగా మారింది. మూడు మండలాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. సరుబుజ్జిలిలో అత్యధికంగా 25.81 శాతం వర్షపాతం (1,037.4 మి.మీకి గాను 1,305.2 మి.మీ) నమోదైంది. రణస్థలంలో 25.39 శాతం అధికంగా (108.8 మి.మీకి గాను 1277.5 మి.మీ), మందసలో 23.88 శాతం అధికంగా (1202.1 మి.మీకి గాను 1489.2 మి.మీ) వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం, ఆమదాలవలస, బూర్జ, ఎచ్చెర్ల, జి.(గంగువారి) సిగడాం, గార, హిరమండలం, జలుమూరు, కోటబొమ్మాళి, లావేరు, మెళియాపుట్టి, నందిగాం, నరసన్నపేట, పలాస, పాతపట్నం, పోలాకి, పొందూరు, సంతబొమ్మాళి, సారవకోట, సోంపేట, టెక్కలి, వజ్రపుకొత్తూరు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు ప్రభుత్వ వెబ్‌సైట్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఈ మండలాల్లో మైనస్
జిల్లా సగటు సానుకూలంగా ఉన్నా, నాలుగు మండలాల్లో మాత్రం ‘లోటు’ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కవిటిలో -27.11 శాతం లోటు నమోదైంది. ఇక్కడ 1303.9 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా, కేవలం 950.4 మి.మీ మాత్రమే కురిసింది. కొత్తూరులో -25.32 శాతం లోటు వర్షపాతం (1232.4 మి.మీకి గాను 920.3 మి.మీ) నమోదైంది. ఇచ్ఛాపురంలో - 24.73 శాతం లోటుతో (896.7 మి.మీకి గాను 686.43 మి.మీ) వర్షాలు ముఖం చాటేశాయి. కంచిలిలో -20.77 శాతం లోటు వర్షపాతం (1261.8 మి.మీకి గాను 999.7 మి.మీ) నమోదైంది. ఈ లోటు.. ఆయా ప్రాంతాల్లోని రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ నెల నిరాశే
గత నెలలో 29 మి.మీ సాధారణ వర్షపాతానికి గాను 22.02 మి.మీ కురిసి పర్వాలేదనిపించినా, ఈ నెల ఆరంభం మాత్రం రైతులను తీవ్ర నిరాశకు గురిచేసింది. జిల్లాలో ఈ నెల 1 నుంచి 19 వరకు 102.43 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా, కేవలం 22.17 మి.మీ మాత్రమే నమోదైంది. ఇది ఖరీఫ్ సన్నాహక పనులకు, నారుమడులకు సిద్ధమవుతున్న రైతులకు కొంత ప్రతికూలంగా మారింది. ఈ నెలలో వర్షాలు తగ్గడం, నాలుగు మండలాల్లో లోటు వర్షపాతం దృష్ట్యా వ్యవసాయ శాఖ అధికారులు ఆయా ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ప్రణాళికలతో రైతులను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది.