Share News

11 మండలాల్లో లోటు

ABN , Publish Date - Oct 02 , 2026 | 12:18 AM

Rain gods came to the rescue in September ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షం ముఖం చాటేసింది. ఆగస్టు నెలాఖరు వరకు చినుకుజాడ లేక కన్నీళ్లే మిగిలాయి. సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలు జిల్లా వ్యవసాయానికి సంజీవనిలా మారినా.. 11 మండలాల్లో మాత్రం లోటు వెంటాడుతోంది.

11 మండలాల్లో లోటు

  • మూడింటిలోనే సాధారణం కన్నా అధికం

  • సెప్టెంబరులో ఆదుకున్న వరుణుడు

  • శ్రీకాకుళం, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి) : ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షం ముఖం చాటేసింది. ఆగస్టు నెలాఖరు వరకు చినుకుజాడ లేక కన్నీళ్లే మిగిలాయి. సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలు జిల్లా వ్యవసాయానికి సంజీవనిలా మారినా.. 11 మండలాల్లో మాత్రం లోటు వెంటాడుతోంది. ‘ఆంధ్రప్రదేశ్‌ వాటర్‌ రిసోర్సెస్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ మేనేజ్మెంట్‌ సిస్టం’ (ఏపీడబ్ల్యుఆర్‌ఐఎంఎస్‌) విడుదల చేసిన తాజా వర్షపాత నివేదిక ప్రకారం (జూన్‌ 1 నుంచి అక్టోబరు 1 వరకు) జిల్లాలో వర్షపాతం పరిస్థితి ఎట్టకేలకు ‘సాధారణ’ స్థాయికి చేరుకుంది.

  • జిల్లావ్యాప్తంగా ఆగస్టులో సాధారణ వర్షపాతం 181.94 మి.మీ కురవాల్సి ఉండగా, 153.31 మి.మీ మాత్రమే నమోదైంది. దీంతో నారుమడులు ఎండిపోయి, పంటలు ఎర్రబడి రైతులు అల్లాడిపోయారు. కానీ, సెప్టెంబరు సాధారణ వర్షపాతం 195.2 మి.మీ కాగా, ఏకంగా 334.42 మి.మీల భారీ వర్షం కురిసి పంటలకు ప్రాణం పోసింది. ఈ భారీ వర్షాల వల్ల అక్కడక్కడా కొంతమేర పంటలు దెబ్బతిన్నప్పటికీ మొత్తంగా చూసుకుంటే ఖరీఫ్‌ గట్టెక్కేందుకు ఈ వానలే ప్రధాన కారణమయ్యాయి.

  • జూన్‌ 1 నుంచి అక్టోబరు 1 వరకు జిల్లాలో సగటున 710.01 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సిన ఉండగా, 627.56 మి.మీ నమోదైంది. ఇది సాధారణ కంటే 11.61 శాతం తక్కువగా ఉన్నప్పటికీ, నిబంధనల ప్రకారం జిల్లా అంతటా ‘సాధారణ’ వర్షపాతం నమోదైనట్లుగానే అధికారులు నిర్ధారించారు.

  • మండలాల వారీగా వర్షపాతం ఇలా..

  • అధిక వర్షపాతం: జిల్లాలోని 3 మండలాల్లో వరుణుడు కరుణించాడు. హిరమండలంలో జూన్‌-అక్టోబర్‌ మధ్య 949.2 మి.మీ (19.58 శాతం అదనం), లక్ష్మీనర్సుపేటలో 898.6 మి.మీ (31.37శాతం అదనం), సరుబుజ్జిలిలో 863.6 మి.మీ (26.26 శాతం అదనం) చొప్పున అధిక వర్షం కురిసింది.

  • సాధారణ వర్షపాతం : ఎచ్చెర్ల, జలుమూరు, కంచిలి, కోటబొమ్మాళి, కొత్తూరు, లావేరు, మందస, నరసన్నపేట, పలాస, పాతపట్నం, రణస్థలం, సంతబొమ్మాళి, సోంపేట, శ్రీకాకుళం(మండలం), టెక్కలి, వజ్రపుకొత్తూరు తదితర 16 మండలాల్లో వానలు ఆశాజనకంగా కురిసి సాధారణ వర్షపాతం నమోదైంది.

  • లోటు వర్షపాతం: సెప్టెంబరు వానలు ఆదుకున్నప్పటికీ జిల్లాలోని 11 మండలాల్లో వర్షపాతం లోటు ఇంకా తీరలేదు. ఆమదాలవలస, బూర్జ, గంగువారి సిగడాం, గార, ఇచ్ఛాపురం, కవిటి, మెళియాపుట్టి, నందిగాం, పోలాకి, పొందూరు, సారవకోట మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ఇందులో ముఖ్యంగా సారవకోటలో 50.41 శాతం, గారలో 42.65 శాతం తక్కువగా వర్షం కురవడం గమనార్హం. మొత్తం మీద ఎల్‌-నినో భయపెట్టినా.. చివరి నిమిషంలో కురిసిన వర్షాలతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి.

  • 5 మండలాల్లో కరువు

  • జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ఐదు కరువు మండలాలను ప్రకటిస్తూ రాష్ట్ర రెవెన్యూ(విపత్తు నిర్వహణ) శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 21 జిల్లాల పరిధిలోని 388 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తిస్తూ.. రెవెన్యూశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జి సాయిప్రసాద్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో జిల్లాకు చెందిన ఆమదాలవలస, బూర్జ, జి.సిగడాం, పొందూరు, రణస్థలం మండలాలు ఉన్నాయి.

  • ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సమయంలో (జూన్‌ 1 నుంచి ఆగస్టు 31 వరకు) రాష్ట్రవ్యాప్తంగా సాధారణ వర్షపాతం 424.3 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా, కేవలం 197.6 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. 53.4 శాతం మేర వర్షపాతం లోటు ఏర్పడింది. ఈ వర్షపాత లోటు, పొడి వాతావరణం, పంటల విస్తీర్ణం, భూగర్భ జలాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది.

  • కలెక్టర్‌ పంపిన నివేదిక ఆధారంగా ఆమదాలవలస మండలంలో తీవ్ర కరువు పరిస్థితి ఉన్నట్టు వెల్లడించింది. బూర్జ, జి.సిగడాం, పొందూరు, రణస్థలం మండలాల్లో సాధారణ కరువు పరిస్థితులు ఉన్నట్టు పేర్కొంది. ఈ ఐదు మండలాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు, రైతులకు రుణ సదుపాయాలు అందుబాటులోకి తెచ్చేందుకు మార్గం సుగుమమైంది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - Oct 02 , 2026 | 12:18 AM