తగ్గుతున్న జనాభా వృద్ధి
ABN , Publish Date - Jul 11 , 2026 | 12:29 AM
Declining fertility rate in the srikakulam జిల్లాలో జనాభా వృద్ధిరేటు ఏటా తగ్గిపోతోంది. పెరిగిన విద్య, వైద్యం ఖర్చులు భరించలేక కొందరు ఇద్దరు పిల్లలతో సరిపెడుతున్నారు. మరోవైపు సంవత్సరాలుగా పిల్లల కోసం ఎదురుచూస్తున్న జంటలూ ఎక్కువగానే ఉన్నాయి. సాధారణంగా సమాజంలో జనాభా స్థిరంగా కొనసాగాలంటే ఫెర్టిలిటీ రేటు (సంతానోత్పత్తి రేటు) 2.1గా ఉండాలి. కానీ జిల్లాలో సగటున 1.5 ఉండడం కలవరపరుస్తోంది.
జిల్లాలో పడిపోతున్న సంతానోత్పత్తి రేటు
భవిష్యత్ ముప్పును ముందే పసిగట్టిన సీఎం
జనాభా పెంపు దిశగా ప్రోత్సాహకాలు
నేడు ప్రపంచ జనాభా దినం
శ్రీకాకుళం, జూలై 10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జనాభా వృద్ధిరేటు ఏటా తగ్గిపోతోంది. పెరిగిన విద్య, వైద్యం ఖర్చులు భరించలేక కొందరు ఇద్దరు పిల్లలతో సరిపెడుతున్నారు. మరోవైపు సంవత్సరాలుగా పిల్లల కోసం ఎదురుచూస్తున్న జంటలూ ఎక్కువగానే ఉన్నాయి. సాధారణంగా సమాజంలో జనాభా స్థిరంగా కొనసాగాలంటే ఫెర్టిలిటీ రేటు (సంతానోత్పత్తి రేటు) 2.1గా ఉండాలి. కానీ జిల్లాలో సగటున 1.5 ఉండడం కలవరపరుస్తోంది. ఏటా జూలై 11న ప్రపంచ జనాభా దినం జరుపుకొంటున్నాం. జనాభా పెరుగుదల, ప్రభావంపై అవగాహన కల్పించేడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ నేపథ్యంలో జిల్లాలో పరిస్థితి పరిశీలిస్తే.. 2011 గణాంకాల ప్రకారం 27,03,114 మంది జనాభా ఉండేవారు. 2021లో జనగణన జరగలేదు. ఇప్పటికి సుమారు 32 లక్షలకుపైగా జనాభా ఉంటుందని అంచనా. 15 ఏళ్లలో ఇంకా జనాభా వృద్ధి చెందాల్సి ఉంది. ఇక పిల్లల జనాభా పరిశీలిస్తే.. 2,81,037(జీరో నుంచి 6 ఏళ్లలోపు ) మంది ఉన్నారు. ఇందులో బాలురు 1,43,835 మంది, బాలికలు 1,37,202 మంది ఉన్నారు. ప్రతి కుటుంబం ఇద్దరు లేదా ఒకరితో మాత్రమే సంతానంగా సరిపెట్టేసుకోవడంతో జననాల రేటు తగ్గుతోంది. జనాభా వృద్ధి రేటు తగ్గుతుండడంతో సంతానోత్పత్తిని పెంచాలంటూ సాక్షాత్తూ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఒకరిద్దరితో కాకుండా ముగ్గురు, నలుగురిని కనాలంటూ కోరారు. ముగ్గురిని కంటే రూ.30వేలు, నలుగురైతే రూ.40వేలు చొప్పున ప్రోత్సాహకం కూడా అందజేస్తామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా జనాభా పెరగాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు.
తగ్గుదలకు కారణాలు ఇవే..
ఫెర్టిలిటీ రేటు పడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని వైద్య నిపుణులు, సామాజిక విశ్లేషకులు చెబుతున్నారు. కరోనా వైరస్ చాలా మందిలో శారీరక రోగనిరోధక శక్తి తగ్గడం, పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ (వీర్యకణాల సంఖ్య) పడిపోవడం, మహిళల్లో పీసీఓడీ వంటి సమస్యలు పెరగడం ప్రధాన కారణం. కెరీర్, సెటిల్మెంట్ అంటూ యువత 30 ఏళ్లు దాటిన తర్వాతే పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇది సంతానోత్పత్తి సామర్థ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. అలాగే జంక్ ఫుడ్‌కు అలవాటు పడటం, శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం వంటివి సంతానలేమికి దారితీస్తున్నాయి. పని ప్రదేశాల్లో విపరీతమైన ఒత్తిడి, నిద్రలేమి, ఉరుకులు పరుగుల జీవితం హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతోంది.
భవిష్యత్తుకు పెద్ద ముప్పు!
ఫెర్టిలిలీ రేటు పడిపోతే భవిష్యత్తులో సామాజిక, ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో సమాజంలో యువత శాతం తగ్గిపోయి, వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. (ప్రస్తుతం జపాన్, చైనా ఎదుర్కొంటున్న సమస్య ఇదే). యువత తగ్గితే.. శ్రామిక శక్తి కరువై వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు కుదేలవుతాయి. ఒంటరి జీవితాలు పెరిగిపోయి కుటుంబ వ్యవస్థ నాశనమయ్యే ప్రమాదం ఉంది.
ఇవి పాటించాలి
25 నుంచి 28 ఏళ్ల లోపు వివాహం చేసుకుని, 30 ఏళ్ల లోపు పిల్లల్ని కనడం ఆరోగ్యకరమని వైద్యులు సూచిస్తున్నారు. ప్రకృతి సిద్ధమైన ఆహారం, తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. రోజువారీ వ్యాయామం తప్పనిసరి. వివాహమైన ఏడాది తర్వాత కూడా సహజంగా సంతానం కలగకపోతే వైద్యులను సంప్రదించాలి. ఫెర్టిలిటీ సమస్యలపై గ్రామస్థాయిలో ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల ద్వారా ప్రజల్లో విస్త్రృత అవగాహన కల్పించేలా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టాలి.
మానవ వనరులే కీలకం
దేశ ఆర్థికవ్యవస్థకు మూలం మానవ వనరులే. మానవ వనరులు కొరత ఏర్పడితే.. ఆర్థిక మాంధ్యం ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే మళ్లీ ప్రభుత్వాలు జనాభా వృద్ధికి కోసం ప్రకటనలు చేస్తున్నాయి. సాంకేతిక ఎంత అభివృద్ధి చెందినా.. మానవ వనరులు లేకపోతే నిరర్థకం అవుతుంది.
- సత్యనారాయణ, అర్ధశాస్త్ర అధ్యాపకుడు, ప్రభుత్వ జూనియర్ కళాశాల
అప్పట్లో పిల్లలు ఎక్కువ
నాకు ఎనిమిది మంది పిల్లలు. మా రోజుల్లో శిశుమరణాలు ఎక్కువగా ఉండేవి. ఆ భయంతో ఎక్కువ మందిని కనేవారు. మగబిడ్డ కోసం ఎన్ని కాన్పులైనా ఎదురుచూసేవాళ్లం. ప్రస్తుతం ఆసుపత్రులు పెరిగాయి. శిశుమరణాలు తగ్గాయి.
- వెలమల నీలమ్మ, జమ్ము
అప్పటి సమస్యలు లేవు
ఆహారం, వైద్య సదుపాయాలపై ప్రస్తుత రోజుల్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జనాభా పెరిగితే నిరుద్యోగం, ఆహారం వంటి సమస్యలు ఏర్పడతాయనే భయం కొందరిలో ఉండేది. నేడు సాంకేతికత పెరిగింది. అధిక దిగుబడి పంటలు పండిస్తున్నాం. వైద్య సదుపాయాలు పెరిగాయి. సమాచార వ్యవస్థలో మార్పులతో సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చును. అయితే ప్రజలకు కష్టపడే తత్వం ఉండాలి. అది లేకుంటే అధిక జనాభాతో అనర్థమే.
-జ్యోతిఫెడ్రరిక్, గణాంక నిపుణులు, రిటైర్డ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్