‘కరువు జిల్లాగా ప్రకటించండి’
ABN , Publish Date - Aug 17 , 2026 | 11:36 PM
జిల్లాలో ఉద్దానం ప్రాంతంలోని ఏడు మండలాల్లో సాగునీరు లేక ఖరీఫ్ సీజనులో రైతులు పంటలు వేయలేదని... జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులకు న్యాయం చేయాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు.
పలాసరూరల్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉద్దానం ప్రాంతంలోని ఏడు మండలాల్లో సాగునీరు లేక ఖరీఫ్ సీజనులో రైతులు పంటలు వేయలేదని... జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులకు న్యాయం చేయాలని వామపక్ష నాయకులు డిమాండ్ చేశారు. పలాస రెవెన్యూ డి విజన్ కార్యాలయం ఎదుట సీపీఐఎంఎల్ లిబరేషన్, ఏఐకేఎం, ఎఐసీసీటీయూ, ఐప్వా నాయకుల ఆధ్వర్యంలో సోమవారం ఆర్డీవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ భాగ్యలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. సాగునీరు లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారని తెలిపారు. ఇంతవరకూ పూర్తిస్థాయిలో పంటలు వేయలేదన్నారు. సాగునీరును ఇచ్ఛాపురం వరకూ పొడిగిస్తే రైతులకు అండగా ఉంటుందని... ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ సమస్యల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు కె.లోకనాథం, పి.నాగేశ్వరరావు, ఎం.వెంకట్రావు, కె.దుష్యంత్, అప్పారావు, అప్పయ్య, ఈశ్వరమ్మ, సుందరమ్మ, రామకృష్ణ, జానకి, దేవరాజు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
మందసలో...
హరిపురం, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి) మందసను కరువు మండలంగా ప్రకటించాలని మహేంద్ర రైతు సంఘం, చైతన్య రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు కోరారు. ఈ సందర్భంగా సోమవారం మందసలో భారీ ర్యాలీ నిర్వహించి, తహసీల్దార్ శ్రీహరిరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు బెస్త కామేశ్వరరావు, మామిడి మాధవరావులు మాట్లాడుతూ మండలంలో వరినారుమడులు, ఎదలు పూర్తిగా నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి అరుతడి పంటలు, తక్కువ రోజుల పంట కాలం వరివిత్తనాలు ఉచితంగా అందజేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు శిష్టు బాబూ జీ, బి .వెంకటరమణ, దుంపల జానకిరావు, మజ్జి బాబూరావు, వీరాస్వామి, కొర్ల హేమారావుచౌదరి, వాసుదేవు, కాళి తదితరులు పాల్గొన్నారు.