మరో వారంలో విధుల్లోకి.. అంతలోనే మింగేసిన మృత్యువు
ABN , Publish Date - Aug 18 , 2026 | 12:14 AM
Elder brother dies while trying to save younger brother విజయనగరం జిల్లా సంతకవిటి మండలం పనసపేటలో నందబావిలో మునిగి ప్రమాదవశాత్తూ అన్నదమ్ములు మొజ్జాడ విష్ణు (22), రామకృష్ణ (21) మృతి చెందారు. మోటారు బాగుచేసేందుకు బావిలో దిగగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
తమ్ముడి రక్షించేందుకు వెళ్లి అన్న మృతి
బావిలో మునిగి అన్నదమ్ముల మృత్యువాత
మోటారు బాగు చేస్తుండగా ప్రమాదం
తాత, అమ్మమ్మ కళ్లెదుటే ఘోరం
అగ్నివీర్ శిక్షణ పూర్తి చేసుకున్న ఆ యువకుడు మరో వారంలో విధుల్లో చేరాల్సి ఉంది. గ్రామదేవతకు మొక్కులు తీర్చేందుకు ఊరికి వచ్చాడు. అన్నయ్యతో కలిసి అమ్మమ్మ, తాత ఇంటికి వెళ్లాడు. మోటారు మరమ్మతు ఉంటే బావి వద్దకు వెళ్లారు. ఆ యువకుడు బావిలోకి దిగి మునిగిపోతుంటే.. అన్న కూడా దిగాడు. అలా ఇద్దరూ నీటిలో మునిగి చనిపోయారు. అమ్మమ్మ, తాత కళ్లెదుటే మృత్యువు వారిద్దరినీ తీసుకెళ్లింది.
పొందూరు/ సంతకవిటి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా సంతకవిటి మండలం పనసపేటలో నందబావిలో మునిగి ప్రమాదవశాత్తూ అన్నదమ్ములు మొజ్జాడ విష్ణు (22), రామకృష్ణ (21) మృతి చెందారు. మోటారు బాగుచేసేందుకు బావిలో దిగగా.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరిది పొందూరు మండలం కోటిపల్లి పంచాయతీ మజ్జిలపేట. తండ్రి మొజ్జాడ అసిరినాయుడు ఎలక్ర్టికల్, మోటారు రిపేరు పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తల్లి వరలక్ష్మి వ్యవసాయ కూలీ. విష్ణు డిగ్రీ, రామకృష్ణ ఐటీఐ చదివారు. వీరిద్దరూ చదువుకుంటూనే తండ్రికి ఎలక్ట్రికల్ మోటారు రిపేరు పనుల్లో సాయం చేస్తూండేవారు. అన్నదమ్ములిద్దరూ సోమవారం సంతకవిటి మండలం పనసపేటలో ఉన్న అమ్మమ్మ, తాతగారింటికి వెళ్లారు. అక్కడ నందబావిలో మోటారు పాడైంది. ఆ మోటారు బయటకు తీయడానికి తమ్ముడు రామకృష్ణ బావిలో దిగాడు. ఈ క్రమంలో నీటిలో మునిగిపోతూ ఉపిరాడక కొట్టుకుంటుండడంతో.. కాపాడేందుకు అన్నయ్య విష్ణు కూడా బావిలో దిగాడు. ఇద్దరూ నీటిలో మునిగిపోవడంతో అమ్మమ్మ, తాతయ్య కేకలు వేశారు. స్థానికులు వచ్చి చూడగా.. ఇద్దరు అన్నదమ్ములూ విగతజీవులుగా కనిపించారు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రణస్థలం నుంచి వచ్చిన ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పోస్టింగ్‌కు వెళ్లాల్సిన వేళ విషాదం
రామకృష్ణ ఇటీవల ఆర్మీలో అగ్నివీర్‌కు ఎంపికై సికింద్రాబాద్‌లో శిక్షణ పూర్తి చేశాడు. మరో వారం రోజుల్లో పంజాబ్‌లో విధుల్లో చేరాల్సి ఉంది. పోస్టింగ్‌కు వెళ్లే ముందు అసిరితల్లికి మొక్కులు చెల్లించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి పనసపేటలోని తాతగారింటికి వచ్చినట్లు బంధువులు తెలిపారు. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. భవిష్యత్‌పై ఎన్నో ఆశలు పెంచుకున్న ఇద్దరు కుమారులు ఒకేసారి మృతుచెందడంతో తల్లిదండ్రులు అసిరినాయుడు, వరలక్ష్మీ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రోదిస్తూ.. స్పృహ కోల్పోయారు. ఒకేసారి అన్నదమ్ములిద్దరూ మృతి చెందడంతో మజ్జిలిపేట, పనసపేట గ్రామాల్లో విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి.