Share News

అదృశ్యమైన వ్యక్తి మృతి

ABN , Publish Date - May 23 , 2026 | 12:10 AM

ఆనందపురం గ్రామానికి చెందిన పొగిరి సత్యం మృతదేహం శుక్రవారం వాండ్రంగి- ఆనందపురం గ్రామాల సమీపంలో లభ్యమైనట్టు ఎస్‌ఐ వెలిచేటి సందీప్‌ కుమార్‌ తెలిపారు.

అదృశ్యమైన వ్యక్తి మృతి

జి.సిగడాం, మే 22 (ఆంధ్రజ్యోతి): ఆనందపురం గ్రామానికి చెందిన పొగిరి సత్యం మృతదేహం శుక్రవారం వాండ్రంగి- ఆనందపురం గ్రామాల సమీపంలో లభ్యమైనట్టు ఎస్‌ఐ వెలిచేటి సందీప్‌ కుమార్‌ తెలిపారు. సత్యం కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఈ నెల 5న స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలో పనిచేస్తున్న ఉపాధి వేతనదారులకు మృతదేహం కనిపించింది. గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్‌ఐ సందీప్‌ కుమార్‌, రాజాం సామాజిక ఆసుపత్రి వైద్యాధికారి కె.సీతారామ్మూర్తి, వీఆర్వో జి. వెంకటమణ సమక్షంలో పోస్టుమార్టం చేసిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

చికిత్స పొందుతూ వ్యక్తి...

పాతపట్నం, మే 22(ఆంధ్రజ్యోతి): బడ్డుమర్రి గ్రామానికి చెందిన పాల జానకి(42) అనే వ్యక్తి శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. జానకి మద్యానికి బానిసయ్యాడు. దీనిని మానుకోవాలని అతని భార్య మందలించడంతో గురువారం ఉదయం తలకు రాసే ఆయిల్‌ తాగి... అపస్మారక స్థితికి చేరాడు. వెంటనే కటుంబీకులు టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. శ్రీకాకుళంలో రిమ్స్‌లో చికిత్సపొందుతూ మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. మృతునికి ఒక కుమారుడు గౌనవ్‌, కుమార్తె శ్యామల ఉన్నారు. భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుమేరకు హెచ్‌సీ శంకరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వివాహిత అదృశ్యం

కోటబొమ్మాళి, మే 22 (ఆంధ్రజ్యోతి): కోటబొమ్మాళి పంచాయతీ ప్రకాష్‌నగర్‌ కాలనీని చెందిన గొలివి సరస్వతి ఆదివారం ఉదయం నుంచి కనిపించడం లేదని ఆమె భర్త గొలివి రాజేష్‌ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు సమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వంగపండు సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 17వ తేదీ ఉదయం ఎవరితోనూ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. బంధువుల ఇళ్ల వద్ద గాలించినా ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు రాజేష్‌ తెలిపారు.

Updated Date - May 23 , 2026 | 12:10 AM