Share News

పరిశ్రమలోనే ప్రాణాలొదిలి..

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:03 AM

Death of a worker in an industry పదేళ్లుగా అదే పరిశ్రమను నమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. రోజూమాదిరి గురువారం రాత్రి కూడా విధులకు హాజరైన ఆ కార్మికుడిని ఊహించని ప్రమాదం బలిగొంది. ఫోర్క్‌ లిఫ్ట్‌ వాహనం ఢీకొనడంతో.. పరిశ్రమలోనే ప్రాణాలొదిన ఘటన చోటుచేసుకుంది. దీంతో అటు కుటుంబ సభ్యులు, ఇటు తోటి కార్మికుల్లో విషాదం నెలకొంది.

పరిశ్రమలోనే ప్రాణాలొదిలి..
సంతోష్‌కుమార్‌(ఫైల్‌)

ఫోర్క్‌ లిఫ్ట్‌ వాహనం ఢీకొని కార్మికుడి మృతి

కుశాలపురంలో విషాదం

ఎచ్చెర్ల, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): పదేళ్లుగా అదే పరిశ్రమను నమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు. రోజూమాదిరి గురువారం రాత్రి కూడా విధులకు హాజరైన ఆ కార్మికుడిని ఊహించని ప్రమాదం బలిగొంది. ఫోర్క్‌ లిఫ్ట్‌ వాహనం ఢీకొనడంతో.. పరిశ్రమలోనే ప్రాణాలొదిన ఘటన చోటుచేసుకుంది. దీంతో అటు కుటుంబ సభ్యులు, ఇటు తోటి కార్మికుల్లో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. ఎచ్చెర్ల మండలం కుశాలపురం పారిశ్రామికవాడలోని ఓ ఇసుక పరిశ్రమలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో కుశాలపురానికి చెందిన మొదలవలస సంతోష్‌కుమార్‌(36) అనే కార్మికుడు మృతిచెందాడు. సంతోష్‌కుమార్‌ గురువారం రాత్రి 10గంటల షిఫ్ట్‌కు హాజరయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పరిశ్రమలోని ఫోర్క్‌ లిఫ్ట్‌ వాహనం వెనుక నుంచి బలంగా ఢీకొంది. దీంతో సంతోష్‌కుమార్‌ తలకు, ఛాతికి గాయాలయ్యాయి. దీనిని గమనించి తోటి కార్మికులు వెంటనే శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సంతోష్‌కుమార్‌ గత పదేళ్లుగా ఇదే పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఈయనకు తల్లి నిర్మల, భార్య కవిత, రెండేళ్ల కుమారుడు శ్రావణకుమార్‌ ఉన్నారు. సంతోష్‌కుమార్‌ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తున్నారు. తోటి కార్మికులు విషాదంలో మునిగిపోయారు. మృతుడి మేనేమామ చాప హరిప్రసాద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎచ్చెర్ల ఎస్‌ఐ జి.లక్ష్మణరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 11 , 2026 | 12:03 AM