Share News

ఒక్కరోజే

ABN , Publish Date - Sep 18 , 2026 | 12:11 AM

Last day.. new pension applications ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తు గడువు శుక్రవారంతో ముగియనుంది. వాస్తవానికి ఈ గడువు ఈ నెల 16తోనే ముగియాల్సి ఉండగా.. ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులు పొడిగించింది. ఇప్పటికే జిల్లాలో వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఒక్కరోజే
మెళియాపుట్టి: పింఛన్ల కోసం దరఖాస్తు చేస్తున్న దృశ్యం

కొత్త పింఛన్ల దరఖాస్తులకు నేటితో ముగియనున్న గడువు

పట్టణ వాసులకు ఊరట

ఇంటి పన్ను అసెస్‌మెంట్‌ నంబరు నిబంధన ఎత్తివేత

శ్రీకాకుళం, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి) : ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు దరఖాస్తు గడువు శుక్రవారంతో ముగియనుంది. వాస్తవానికి ఈ గడువు ఈ నెల 16తోనే ముగియాల్సి ఉండగా.. ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజులు పొడిగించింది. ఇప్పటికే జిల్లాలో వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కరోజే మిగిలి ఉండడంతో ఇంకా దరఖాస్తు చేసుకోని వారు వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల్లోని డిజిటల్‌ అసిస్టెంట్లకు దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు. కొత్త పింఛన్ల దరఖాస్తుల విషయంలో పట్టణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. శ్రీకాకుళం నగరం, ఆమదాలవలస, పలాస కాశీబుగ్గ, ఇచ్ఛాపురం పట్టణాల్లో దరఖాస్తు చేసుకునేందుకు ‘ఇంటి పన్ను అసెస్‌మెంట్‌ నంబర్‌’ నమోదు చేయాలన్న నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. గత ప్రభుత్వ హయాంలో దీనిని ప్రామాణికంగా తీసుకున్నారు. అయితే ఇటీవల స్వర్ణ వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల సందర్భంగా ఎదురైన సాంకేతిక ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయం తీసుకుంది. స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ సచివాలయాల శాఖ వెబ్‌సైట్‌లో మొన్నటి బుధవారం నుంచే ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. దీంతో అసెస్‌మెంట్‌ నంబర్‌ లేకపోయినా పింఛనుకు దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త పింఛన్ల నమోదైన దరఖాస్తులను గ్రామ, స్వర్ణ వార్డు, ఆర్టీజీఎస్‌, సెర్ప్‌ విభాగాల అధికారులు ఈ నెల 21వ తేదీలోగా ప్రాథమికంగా పరిశీలించనున్నారు. ఎంపీడీవో, మునిసిపల్‌ కమిషనర్‌, జిల్లా అధికారులు వాటిని మరోసారి పరిశీలించి ఈ నెల 24లోగా అర్హులను నిర్ధారిస్తారు. 25, 26 తేదీలో సెర్స్‌ ద్వారా తుది ఆమోదం తెలిపి జాబితా సిద్ధం చేస్తారు.

Updated Date - Sep 18 , 2026 | 12:12 AM