మేల్కోకపోతే ముప్పు
ABN , Publish Date - Feb 28 , 2026 | 12:28 AM
Drains bad in Palasa శ్రీకాకుళంలో ఇటీవల డయేరియా విజృంభణ అంతటా చర్చనీయాంశమైంది. కార్పొరేషన్ పరిధిలో పైపులైన్లు లీకు అవడంతో తాగునీరు కలుషితమై డయేరియా వ్యాపించిందనే ప్రచారం సాగుతోంది.
పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో అధ్వానంగా కాలువలు
చెరువుల్లో చేరుతున్న మురుగునీరు
అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని స్థానికుల ఆందోళన
పలాస, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలో ఇటీవల డయేరియా విజృంభణ అంతటా చర్చనీయాంశమైంది. కార్పొరేషన్ పరిధిలో పైపులైన్లు లీకు అవడంతో తాగునీరు కలుషితమై డయేరియా వ్యాపించిందనే ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాలతో శ్రీకాకుళం నగర వాసులతోపాటు మిగిలిన ప్రాంతవాసులు కూడా అప్రమత్తమవుతున్నారు. మురుగునీటి వ్యవస్థపై మేల్కోకపోతే ముప్పు తప్పేలా లేదని భయాందోళన చెందుతున్నారు. పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ పరిధిలో కూడా కాలువలు అధ్వానంగా ఉన్నాయని, మురుగునీటి వ్యవస్థతో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి నెలకొందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో 31 వార్డులు ఉన్నాయి. అన్ని వార్డుల్లోనూ మురుగునీటి కాలువలు సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాలువలు ఉన్నా మురుగునీరు బయటకు వెళ్లడానికి మార్గం లేక భూమిలోనే ఆ నీరు ఇంకిపోతోంది. కొన్నిచోట్ల చెరువుల్లోకి మురుగునీరు మళ్లించడం వల్ల ఆ ప్రాంతమంతా కలుషితమవుతోంది. దీంతోపాటు చాలాచోట్ల చెత్తాచెదారాలు పేరుకుపోవడంతో అంటురోగాలు ప్రబలే అవకాశాలు ఉన్నాయి.
పలాసలోని మురుగు నీరంతా సీతమ్మతల్లి గుడి ప్రాంతంలో ఉన్న వంశధార కాలువలో కలుస్తుంది. ఆ కాలువ నీరు.. 60 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన జగన్నాథసాగరం చెరువులోకి వచ్చి చేరుతుంది. ఇక్కడ నీటిని క్లోరినేషన్ చేసి.. బావుల ద్వారా ఇంటింటా, పబ్లిక్ కుళాయిలకు అందిస్తున్నారు. కాగా క్లోరినేషన్ చేసినప్పటికీ.. కలుషిత నీరు శుద్ధి చేసి మరల్చడం ఇబ్బందే.
కాశీబుగ్గలో నీరంతా పాత జాతీయరహదారి పక్కన ఉన్న మురుగు కాలువ ద్వారా ప్రవహిస్తూ దేశబట్టిలో కొంతభాగం కలుస్తుంది. రాధాకాంతచెరువు పక్కనుంచి పంట కాలువల్లోకి మరికొంత చేరు చేరుతోంది. ఆ ప్రాంతంలో నీరంతా పచ్చగా మారి.. చివరి వరకూ కాలువ వ్యవస్థ లేకపోవడంతో భూమిలోనే ఇంకిపోతోంది. వర్షాకాలంలో కాలువల్లో నీరు ఇళ్ల మీదుగా ప్రవహించి ఆ ప్రాంతంలో ఉన్న బావులు, బోర్లు అన్నీ కలుషితమవుతున్నాయి.
చిన్నతిరుపతి ఆలయానికి వెళ్లే మార్గంలో ఇళ్లన్నీ దిగువన ఉన్నాయి. దీంతో మురుగునీరు ప్రవహించి బయటకు వెళ్లడానికి మార్గం లేకుండా పోయింది. ఆ ప్రాంతంలో ప్రజలు ఇటీవల చందాలు పోగుచేసుకొని మురుగునీటిని బయటకు పంపించారు. మిగిలిన ఇళ్లల్లో వాడుక నీరంతా సమీపంలో బీఎస్‌ఎన్‌ఎల్ స్థలాల్లోకి వెళ్లి భూమిలో ఇంకిపోతోంది. దీంతో ఆ ప్రాంతంలో జలాలు కలుషితమవుతున్నాయి.
ఉదయపురం శివారు మల్లా సీతమ్మ క్వార్టర్స్ సమీపంలో మురుగునీరు వెళ్లడానికి మార్గం లేకపోవడంతో వ్యర్థనీరంతా సమీప చెరువులోకి చేరిపోతోంది. దీంతో ఆ ప్రాంతంలో బోర్లు పాడయిపోతున్నాయి. వ్యర్థ నీటి నిల్వతో దోమల బెడద ఎక్కువై ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
కాలువ వ్యవస్థ పూర్తికాకపోవడంతో పలాస మోర్ జంక్షన్ వద్ద నిత్యం చెత్త నిండిపోతోంది. వరదలు వస్తే తప్ప.. ఇందులో చెత్త బయటకు వెళ్లే మార్గం లేకుండా పోయింది. దీనిపై పురపాలక సంఘ పాలకులు, అధికారులు తక్షణం చర్యలు చేపట్టాల్సి ఉంది.