Share News

అతి వేగం తెచ్చిన ముప్పు

ABN , Publish Date - Jul 25 , 2026 | 12:43 AM

అతివేగం ఒకరి మృతికి...నలుగురు గాయపడడానికి కారణ మైంది.

 అతి వేగం తెచ్చిన ముప్పు
మనోహర్‌ (ఫైల్‌)

  • ద్విచక్ర వాహనాలు ఢీ: ఒకరు మృతి

  • నలుగురికి గాయాలు

జలుమూరు, జూలై 24 (ఆంధ్రజ్యోతి): అతివేగం ఒకరి మృతికి...నలుగురు గాయపడడానికి కారణ మైంది. చల్లవానిపేట సమీపంలో జలుమూరుకు వెళ్లే రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో అలుదు గ్రామానికి చెందిన యారబాటి మనోహర్‌ (23) మృతి చెందాడు. మరో నలుగురికి గాయాలయ్యాయి. ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు.. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు... సారవకోట మండలం అలుదు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు స్కూటీపై చల్లవానిపేట నుంచి జలుమూరు వెళుతున్నారు. అదే సమయంలో కోటబొమ్మాళి మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు జలుమూరు నుంచి చల్లవానిపేట వస్తున్నారు. ఎదురెదురుగా వస్తున్న వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మనోహర్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. అదే గ్రామానికి చెందిన కొర్రాయి శివ (25), యారబాటి భరత్‌కుమార్‌ (23), విశ్వనాఽథపురం గ్రామానికి చెందిన పిట్ట చందు (21), ఆశ్వాన కీర్తన (22) లు గాయపడ్డారు. స్థానికులు 108కి సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి సిబ్బంది చేరుకొని క్షతగాత్రులను నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కీర్తన పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మనోహర్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌.ఐ. బి.అశోక్‌బాబు తెలిపారు. తల్లి రామలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతిచెందిన మనోహర్‌కు తల్లి రామలక్ష్మి, తమ్ముడు దిలీప్‌కుమార్‌ ఉన్నారు. తండ్రి మల్లేసు మూడేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో కుటుంబాన్ని పోషించాల్సిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో తల్లి రామలక్ష్మి భోరున విలపిస్తోంది. గాయపడిన కొర్రాయి శివకు మాత్రమే వివాహమైంది.

Updated Date - Jul 25 , 2026 | 12:43 AM